Andhra Pradesh News: ఎన్నికలు అంటేనే గొడవలు, కొట్లాటలు, ఉద్రిక్తతలు..ఇక ఢీ అంటే ఢీ అనే నియోజకవర్గాల్లో ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుంటారు. కృష్ణా(Krishna), గుంటూరు(Guntur) జిల్లాల్లో మాత్రం ఎన్నికలు వచ్చాయంటే ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయి. మచిలీపట్నం(Machilipatnam)లో తెలుగుదేశం కార్యకర్త ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. టీడీపీ(TDP) కార్యకర్త యశ్వంత్‌ను తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న యశ్వంత్‌కు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు(Perni Kittu) వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు..
మచిలీపట్నంలో ఉద్రిక్తత
మచిలీపట్నం రూరల్ మండలం ఉల్లిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం(Telugudesam) కార్యకర్త యశ్వంత్ ఇంటిపై కొందరు దుండగులు రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న యశ్వంత్‌ను తీవ్రంగా కొడుతూ కారులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యశ్వంత్(Yaswanth) ఏదైనా తప్పు చేసిన ఉంటే...పోలీసులు వెళ్లి తీసుకురావాలి కానీ రౌడీలువ వెళ్లడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా యశ్వంత్‌ను కొట్టుకుంటూ తీసుకొచ్చిన వారిని పట్టుకుని కేసు పెట్టకుండా ఎలా వదిలేశారని ఆయన మండిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను ఆయన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
కిట్టు అనుచరుల పనే..!
యశ్వంత్‌పై దాడి చేసింది మాజీమంత్రి పేర్నినాని(Perni Nani) కుమారుడు కిట్టు అనుచరులేనని కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెలుగుదేశం(TDP)ఫ్లెక్సీలు కడుతున్నారని కిట్టు అనుచరులు 20 మంది వచ్చి దాడికి పాల్పడ్డారని యశ్వంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉన్నవాడిని కారులో ఎక్కించుకుని తిప్పుతూ తీవ్రంగా కొట్టారని తల్లి భోరున విలపించింది. తమకు అసలు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. తమ కుమారుడిని చంపేస్తారేమోనంటూ భయపడుతోంది. దాడికి పాల్పడిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పత్తి పవన్, హేమనాన, చరణ్, పత్తి రామారావు సహా 20 మంది దాడిలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడి చేసిన వారిపై యశ్వంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుని తీవ్రంగా కొట్టారని... 20 మంది ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చారని యశ్వంత్ తల్లి భయాందోళన వ్యక్తం చేశారు. తాము ఎవరినీ ధూషించడంగానీ, విమర్శించడం గానీ చేయలేదన్నారు. మా పని ఏదో మేం చేసుకుంటాం తప్ప...రాజకీయ గొడవలు అసలు తెలియవన్నారు. అర్థరాత్రి వరకు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక భయపడిపోయామన్నారు. ఖచ్చితంగా తమ కుమారుడిని చంపేస్తారని భావించామన్నారు.
కొల్లు రవీంద్ర ఆగ్రహం
యశ్వంత్‌ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ తీవ్రంగా కొట్టారని...ప్రస్తుతం అతను నడవలేనిస్థితిలో ఉన్నాడని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నా...కొట్టుకుని తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...ప్రజలను భయపెట్టాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు సైతం బాధితులకు రక్షణగా నిలవకుండా అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు.యశ్వంత్ కు ఏం జరిగినా..పేర్నినాని (Perni Nani)ఆయన కుమారుడు కిట్టునే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.