Attack on SI : ప్రజలకు అండగా నిలిచే పోలీసులపై దాడులు చేస్తున్నారు. శాంతి, భద్రతలను రక్షించే లక్ష్యంతో పని చేస్తోన్న వారిపై దారుణానికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ మఫ్టీలో ఉన్న ఎస్ఐ పై దాడి జరిగింది. డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. స్టేషన్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్టేషన్ లో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్థరాత్రి రాజుపాళేనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు దాడి చేశారు.
ఆ కోపంతోనే ఎస్ఐపై దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజుపాళేనికి చెందిన చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్ పై బైపాస్ రోడ్డు దాటుతుండగా.. అంతలోనే ఆ మార్గంలో వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ప్రయాణికులు గాయపడ్డారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ఈ ప్రమాదం చూశాడు. గాయపడ్డ వారిని తమ పోలీసు జీపులోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ కడపలోని కొండాయపల్లెకు చెందిన వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదాల ఘటనలపై కేసు నమోదు చేయడం, కారణమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి పంపించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అదే తరహాలో స్పందించిన ఎస్ఐ ఎప్పటిలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశాడు. కారు డ్రైవర్ వెంకటరెడ్డికి నోటీలు అందించి పంపించాడు.
నోటీసు ఇచ్చి పంపిస్తారా? అంటూ పోలీసులపై దాడి
ఈ ఘటనతో అసహనానికి గురైన చిన్న లింగమయ్య బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. అంతటితో ఆగకుండా అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి నోటీసు ఇచ్చి పంపిస్తారా? అంటూ నేరుగా స్టేషన్ వద్దకు వెళ్లి తమ ప్రతాపం చూపించారు. ఠాణాలో విధుల్లో ఉన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ లేడు. అప్పటికే ఇంటికి పోయాడు. కానీ ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో పోలీస్ సిబ్బంది ఎస్ఐకి సమాచారమందించారు. దీంతో వెంటనే మఫ్టీలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్ఐపై చిన్న లింగమయ్య అన్న లింగమయ్య ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు.
అనంతరం లింగమయ్యతో పాటు శివ, ప్రవీణ్, రాము, మేరి, శాంతి మరికొందరు తన విధులకు ఆటకం కలిగించి దాడి చేశారని రెండో పట్టణ ఠాణాలో ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై డీఎస్పీ భక్తవత్సలం గ్రామీణ ఠాణాకు చేరుకుని ఆరా తీశారు. ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ యుగంధర్ వెల్లడించారు.
Also Read : Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను