Attack On Inter Student In Kadapa District: కడప జిల్లాలో (Kadapa District) దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినిపై యువకుడు శనివారం మధ్యాహ్నం పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేల్ (Badwel) సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బాధితురాలి వాంగ్మూలం ఇదే


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. 'విఘ్నేశ్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు. నీవు లేకుంటే చనిపోతాను అని బెదిరించాడు. అతనికి 6 నెలల క్రితమే వివాహమైంది. తాను కట్టుకున్న భార్య వద్దని నీవే కావాలంటూ నన్ను వేధించాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. నేను అందుకు నిరాకరిస్తే పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు.' అని పేర్కొన్నారు.


నిందితునికి వివాహమైనా..


నిందితుడు విఘ్నేశ్ తమ కుమార్తెను ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి వివాహమైనా వేధింపులు ఆపలేదని.. శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.


'4 బృందాలతో పోలీసుల గాలింపు'


నిందితుని ఆచూకీ కోసం 4 బృందాలతో గాలింపు చేపట్టామని కడప ఎస్పీ హర్షవర్థన్ తెలిపారు. 'గాయపడిన ఇంటర్ విద్యార్థినికి కడప రిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. 80 శాతం గాయాలయ్యాయి. చిన్నప్పటి నుంచీ ఇద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందినవారే. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేశ్ ఫోన్ చేశాడు. కలవకపోతే చనిపోతానని ఆమెను బెదిరించాడు. ఇద్దరూ పీపీకుంట చెక్ పోస్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేశ్ పరారయ్యాడు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


ఆరా తీసిన సీఎం చంద్రబాబు


అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.


కర్నూలు జిల్లాలో దారుణం


అటు, కర్నూలు జిల్లాలోనూ ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలని ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె నోట్లో పురుగుల మందు పోసి పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి మండలం నగరూరులో చిన్న వీరేశ్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థిని పట్ల మృగాడిలా ప్రవర్తించాడు. పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోన్న విద్యార్థిని.. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే తనను ప్రేమించాలని విద్యార్థినిని వేధించాడు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించగా.. ఆమె ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఈ పెనుగులాటలో వీరేశ్‌కు కూడా గాయాలయ్యాయి. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Nara Lokesh: మున్సిపల్ స్కూలులో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు, చిన్నారులతో సరదాగా ఫొటోలు