Rythu Bharosa Scheme In Telangana | హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. రైతుకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా పథకాన్ని వచ్చే వ్యయవసాయ సీజన్ నుంచి ఇస్తామన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక దానికి అనుగుణంగా రైతు భరోసా ఇస్తామని మీడియాతో మాట్లాడుతూ ఇవాళ స్పష్టం చేశారు. వచ్చే రబీ సీజన్ నుండే రైతులకు ఎకరానికి రూ. 7500 చెల్లించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెట్టుబడి సాయం అదించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక తయారు చేస్తుందని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
త్వరలోనే రుణమాఫీ...
సాంకేతిక కారణాలతో కొద్ది మందికి నిలిచిపోయిన 2 లక్షల రైతు రుణ మాఫీ త్వరలోనే అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నెల 31 తర్వాత ఈ రుణ మాఫీ ప్రక్రియ అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది.
రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఈ ప్రకటనలు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కమిటీల పేరు చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మోసం చేయడం ప్రభుత్వ విధానంలో భాగం అని కేటీఆర్ అన్నారు. వర్షాకాలానికి రైతు భరోసా ఇవ్వమని మంత్రి తుమ్మల ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఖాతాలో రైతు భరోసా మొత్తాన్ని జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కు రాం రాం చెబుతారని కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని విమర్శించారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవడం వల్లే సబ్ కమిటీ అని ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. పేదల కడుపు కొట్టి లక్షా 50 వేలతో మూసీ సుందరీకరణ కు డబ్బులు ఉంటాయి గాని రైతులకు ఎకరాకు 7500 ఇచ్చేందుకు డబ్బులు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదన్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు - బీఆర్ఎస్
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా (Raithu Bharosa Scheme ) ఎగగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారత రాష్ట్ర సమతి పిలుపునిచ్చింది. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం