Asifabad Maoist sympathisers arrested in Kumuram Bheem District: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ తెలిపారు. శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్పీ సురేష్ కుమార్ మట్లాడుతూ.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట్ మండలం మురళిగూడా గ్రామపంచాయతీలోని జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనంద్ రావు, నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన చేన్నగొని గణేష్ లను బెజ్జూర్‌ అటవి ప్రాంతంలో మావోయిస్డులను కలిసేందుకు వెళుతుండగా పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 5 జిలేటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధ్రువపత్రాలు, రెండు సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆకస్మిక తనిఖీ చేసి ఇద్దరి అరెస్ట్..
విశ్వసనీయ సమాచారంతో కాగజ్‌నగర్ రూరల్ సిఐ నాగరాజు, పెంచికల్పేట్ పోలీస్ సిబ్బందితో కలిసి అగర్ గూడ గ్రామ శివారు గుట్టల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తుండగా కోట ఆనందరావు, చేన్నగొని గణేష్ అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై బెజ్జూర్ అటవీ ప్రాంతం వెళ్తుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించంగా వారు సీపీఐ మావోయిష్టు పార్టీకి సానుభూతి పరులుగా పనిచేస్తూ, ప్రజా సంఘాలలో పని చేస్తున్నామని చెప్పారు. పార్టీ దళంలో చేరుటకు సభ్యులను రిక్రూట్ చేస్తున్నామని, వారు వచ్చినప్పుడు వారికి వస్తువులు కొనిపెట్టటం, వాటిని సరఫరా చెయ్యటం, భోజనం పెట్టటం చేస్తామని నిందితులు పోలీసులకు తెలిపారు. అదేవిధంగా ఊర్లలో ఉన్న మిలిటెంట్ లను పార్టీకి అనుకూలంగా పని చేసే విధంగా చేస్తున్నాం, సిపిఐ మావోయిష్టు పార్టీ తరుపున కాంట్రాక్టర్ ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తున్నామని, తనకు సిపిఐ మావోయిష్టు పార్టీలో పుల్లూరి ప్రసాదరావు @ చంద్రన్న, మైలారపు అడేల్లు @ భాస్కర్, బండి ప్రకాష్ @ ప్రభాత్, రాధక్క, మున్న, వర్గీష్, మనీష్, రమణ @ చెన్నూరి శ్రీనివాస్, ఇంకా కొంతమందితో పరిచయాలు ఉన్నవని చెప్పారు.


అప్పుడప్పుడు వారిని మా ఊరికి వచ్చినప్పుడు మరియు గడ్చిరోలి అడవీ ప్రాంతంలో, ఛత్తీస్ ఘడ్ అడవీ ప్రాంతానికి వెళ్ళి కలిసేవాడినని, వారు చెప్పినట్లు తను నడుచుకునే వాడినని నిందితులు చెప్పారు. అదేవిధంగా గణేశ్ ను కూడా సీపీఐ మావోయిష్టు పార్టీ చేరితే బాగుంటుందని కోట ఆనందరావు తనను ప్రోత్సహించినట్టు గణేష్ తెలిపడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట్ ఎస్ఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా పాల్గొన్నారు.