Bhimavaram News: చిత్తూరు జిల్లాలో 16 బాలిక అనుమానాస్పద మృతి మరవకముందే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మరో దారుణం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అదృశ్యమైన బాలిక ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. భీమవరంలోని ఓ కాలనీకి చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఉదయం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించారు. తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు భీమవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం వారి ఇంటి సమీపంలోని పొదల్లో బాలిక మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
బాలిక ఒంటిపై గాయాలు
బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమీప బంధువు ఒకరు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం. బాలికకు బాబాయ్ వరసయ్యే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని భార్య కువైట్‌లో ఉంటోంది. వారి పిల్లలు నరసాపురంలోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. సదరు వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం బాలిక పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక దుస్తులు ఆ వ్యక్తి ఇంటి వద్ద లభించడం, మృతదేహంపై గాయాలుండటంతో అత్యాచారం చేసి హతమార్చినట్టు భావిస్తున్నారు.
చిత్తూరులో బావిలో డెడ్ బాడీ
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన బాలిక ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో బాలిక శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.
ఈ కేసును అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ శ్రీలక్ష్మీ తెలిపారు. బాలికది ఆత్మహత్య కాదని, అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారన్నారు. నలుగురు యువకులపై అనుమానం ఉందనడంతో ప్రశ్నిస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రుల ఎదుటే పోస్ట్ మార్టమ్ చేశారన్నారు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని.. అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానంతో మృతురాలి నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకుని తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. ఈ రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు బయటపడతాయన్నారు.