Cyber Crime : మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కొన్నిసార్లు ఎలక్ట్రిసిటీ బోర్డుల నుంచి మెసేజ్ లు వస్తుంటాయి. భారీగా వర్షం పడినప్పుడో లేకు ఏదైన విద్యుత్ పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి మెసేజ్ రావడం సహజం. పైగా ఈ మేసెజ్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్లో మన ఫోన్ నెంబర్ రిజిస్ట్రర్ చేసుకుంటేనే మేసెజ్ వస్తుంటాయి. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చారు. నకిలీ మేసెజ్ లు పంపిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. 


ఫోన్ చేశారో ఖాతా ఖాళీ 


'డియర్‌ కస్టమర్‌ మీ ఇంటి విద్యుత్‌ సరఫరా ఇవాళ రాత్రి నిలిపివేస్తున్నాం. మీరు ఈ నెల కరెంట్ బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నాం. మీరు వెంటనే ఈ నెంబర్ ను సంప్రదించండి' ఓ మెసేజ్ వస్తుంది. ఇందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేయగానే విద్యుత్ అధికారి మాట్లాడినట్లు ఒకరు మీతో మాట్లాడతారు. వాళ్ల మాటలు నమ్మితే మీరు ఖాతా ఖాళీ అయినట్లే.   


విద్యుత్ శాఖ ఇలా మేసెజ్ లు పంపదు 


మీకు వచ్చిన మెసేజ్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తే అచ్చం విద్యుత్ అధికారి మీతో మాట్లాడతారు. విద్యుత్ బిల్లు చెల్లించని కారణంగా కరెంట్ నిలిపివేస్తున్నామంటారు. బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఇంకా పెండింగ్ లో ఉందని మాకు సొమ్ము చేరలేదని చెబుతారు. ఇందుకోసం ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్‌ అవుతాయని నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి యాప్ డౌన్‌లోడ్‌ చేసి రూ.10 చెల్లిస్తే మీ ఖాతాలో నగదుకు రెక్కలొచ్చినట్లే. ఇలా చేస్తే కాసేపటికే మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్ డ్రా అయినట్లు మేసెజ్ వస్తుంది. మీ ఖాతాలో నగదు మాయం అవుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ మేసెజ్ లు విద్యుత్‌ శాఖ పంపదని అధికారులు తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 


Also Read : Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?


Also Read : Bank Fraud: డేటింగ్‌ యాప్‌లో అమ్మాయితో లవ్వు! పనిచేస్తున్న బ్యాంకుకే కన్నమేసిన ఉద్యోగి!