Road Accident in Palnadu district | పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెట్టును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని అద్దంకి- నార్కట్‌పల్లి హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. 


కొత్త కారుకు పూజలు చేపించి, తిరిగొస్తుంటే విషాదం


అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ నిద్ర మత్తు కూడా ఓ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లాకు చెందిన వారు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్‌, వెంకటేశ్వర్లు, వనిత, యోగులు తమ కొత్త కారుకు పూజలు చేయించేందుకు మరికొందరు కుటుంబసభ్యులతో కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు చెట్టును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏషియన్ పెయింట్స్ గోడౌన్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అనంతరం మృతదేహంపై నుంచి వాహనాలు సైతం వెళ్లడంతో ముక్కలు ముక్కలైందని పోలీసులు తెలిపారు. ఆ ముక్కలైన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇల్లు
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వెలగన దుర్గయ్య అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగి, కొన్ని నిమిషాల్లోనే ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. క్యాన్సర్ పేషెంట్ అయిన తన భార్యతో ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టాడు దుర్గయ్య. అయితే కొంత నగదు, 3 కాసుల బంగారంతో పాటు ఇంట్లో సామాన్లు అన్ని ఖాళీ బూడిద కావడంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది.



Also Read: Crime News: ఇన్‌స్టాలో పరిచయం అయి పెళ్లి అనే సరికి దుబాయ్ నుంచి ఎగిరొచ్చేశాడు - పెళ్లి డ్రస్‌లో కల్యాణమండపానికి వెళ్లే సరికి...