Tirumala news: తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కోసం వేల కిలో మీటర్లు ప్రయాణం.. వేల రూపాయల ఖర్చు అయినా స్వామివారిని క్షణకాలం పాటు చూస్తే జన్మతరిస్తుందని భావించే భక్తులు తమకు తోచిన విధంగా తులమో... ఫలమో ఇస్తుంటారు.. కొందరు నిలువుదోపిడీ కూడా ఇస్తారు.. ఇలాంటి భక్తులు ఎందరు ఉన్నా దాతలకు మాత్రం టీటీడీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. 


తిరుమలలో అనువనువు శ్రీనివాసుడు కొలువైనాడనేదేని భక్తుల విశ్వాసం. ఇలాంటి చోట సేవ చేసే అవకాశం కలిగితే అంతకంటే మహాత్ భాగ్యం మరొక్కటి ఉండదు అనేది భక్తులు మాట. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దాతలుగా మారితే అంతకంటే సేవ మరొక్కటి ఉండదు. ఇలా జాతులుగా మారే అవకాశం టీటీడీ మరొక్క పథకం తీసుకొచ్చింది. 


* ఆనంద నిలయం అనంత స్వర్ణమయం


శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దివ్యమంగళ స్వరూపంగా దర్శనం ఇస్తున్న తిరుమల ఆనంద నిలయం. ఈ ఆనంద నిలయం 15వ శతాబ్దం లో స్వర్ణమయం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కోసం 2008లో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు ప్రతిపాదనను అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. సుమారు 100 కోట్ల అంతనాతో 450 కేజీల బంగారం తో స్వామి వారి ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేయడానికి 2008 ఆగస్టులో అడుగులు పడ్డాయి. టీటీడీ పాలకమండలి సెప్టెంబర్ లో తీర్మానం కూడా చేసింది.


రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో శ్రీవారి ఆలయం లోని గంటా మండపం నుంచి హూండీ వరకు.. రెండో దశలో వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో బంగారు తాపడం చేయించాలని తీర్మానించారు. మొదటి దశ పనులకు 60 కోట్ల వ్యయంతో 250 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది టీటీడీ ఇంజినీరింగ్ విభాగం.. రెండో దశ పనులకు 40 కోట్ల వ్యయంతో 200 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు ఆకృతుల తయారీ బాధ్యతలను పద్మశ్రీ గణపతి సప్తపతి అప్పగించింది టీటీడీ. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని MMTS ద్వారా మేలిమి బంగారంతో తయారు చేయాలని భావించింది. అదేవిధంగా దాతలు నుంచి విరాళాలకు ఆహ్వానం పలికారు.


* అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం


2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్టోబర్ 1వ తేదీ ఈ ప్రాజెక్టు ను ప్రారంభించారు. అదే రోజు అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి బంగారం విరాళం అందజేశారు. ఎంతలా అంటే కేవలం 30 రోజుల వ్యవధిలో 80 మంది నుంచి 94.8 కేజీల బంగారం విరాళంగా అందింది. 187 మంది దాతలు 12.86 కోట్ల రూపాయలు నిధులు ఈ ప్రాజెక్టు కు అందజేశారు. 270 మంది మంది దాతలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు అప్పట్లో టీటీడీ ప్రకటించింది.


* ఏడాది కాలానికి అవాంతరాలు


ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు 2008 అగస్టు లో ప్రాజెక్టుకు అడుగులు పొడిగా.. ఏడాది కాలం తిరగకమునుపే అంటే సరిగ్గా 2009 జూన్ నుంచి అవాంతరాలు ఏదురైనాయి. అప్పటి ఈవో గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి.


ఈ ప్రాజెక్టు కారణంగా టీటీడీపై భారం పడుతుందని ఈవో వాదన కాగా.. భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చనేది ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు వాదన. అప్పటికే వచ్చిన విరాళాలతో ఆకృతులు సిద్ధం అవుతుండగా మరో రూపంలో అడ్డుపడింది. ఈ ప్రాజెక్టు ఆగమ విరుద్ధం అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టు తలుపు తట్టారు. ఆగమశాస్త్రం, టీటీడీ వ్యవహారం కావడంతో ఇందులో హైకోర్టు జోక్యం అనవసరం అంటూ తేల్చింది. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు సాగడంతో మరో వాదన ముందుకు వచ్చింది.


శాసనాలు కనుమరుగు అవుతాయని ప్రచారం


ఈ ప్రాజెక్టు కారణంగా 10వేలకు పైగా మేకులు స్వామి వారి ఆలయ గోడలపై కొట్టాల్సివస్తుందని.. ఎంతో ప్రాచీన కాలం నాటి శాసనాలు కనుమరుగు అవుతాయనే ప్రచారం సైతం విస్తృతంగా సాగింది. అయితే ఛైర్మన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆలయ గోడలకు కాకుండా గోడకు అడుగు దూరంలో ఫ్రేములు ఏర్పాటు చేసి వాటికి తాపడం ఆకృతులు ఏర్పాటు అనేది ముందుకు తెచ్చారు. గోడల పై ఉన్న 1400 శాసనాలను సైతం డిజిటలైజేషనే చేసి భద్రపరిచేందుకు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం రెడ్డి ఆధ్వర్యంలో వివిధ భాషల్లో మార్పు చేసి మ్యూజియం లో భద్రపరిచారు. టీటీడీ ఆలయ ప్రతిష్ట దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ రాసారు. ఆ లేఖతో పాటు ప్రభుత్వ మెట్లు ఎక్కారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.


2010 ఆగస్టులో ఆదికేశవులు నాయుడు పదవి కాలం పూర్తి కావడంతో ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 29న పనులు నిలిపివేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. 2011 జనవరిలో సమావేశం నిర్వహించిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రాజెక్టు కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను వెనక్కి తీసుకోవడం లేదా ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం అంటూ దాతలకు సూచించింది టీటీడీ. ఈ నిర్ణయం తో ముగ్గురు దాతలు 3 కేజీల బంగారం వెనక్కి తీసుకోగా.. మరో 26 మంది దాతలు 27కేజీల బంగారంను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. కొందరు దాతలు కోటి రూపాయలు వెనక్కి తీసుకోగా.. మిగిలిన దాతలు 7.25 కోట్లు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. 60.28 కేజీల బంగారాన్ని, 4.61 కోట్లను భక్తులు వెనక్కి తీసుకోలేదు.. ఇతర ప్రాజెక్టులకు మళ్లించలేదు. దీంతో ఆ బంగారం, నిధులను టీటీడీ ట్రెజరీకి తరలించారు.



*13 ఏళ్ల తర్వాత వెలుగులోకి


2008లో ప్రారంభమైన ప్రాజెక్టు 2011లో నిలిచిపోయింది. సుమారు 13 ఏళ్ల తర్వాత ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వచ్చిన ధర్మకర్తల మండలి తొలి సమావేశం లో కొన్ని మార్పలతో కూడిన అమలుకు సంకల్పించింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల  వివరాలు ఇలా ఉన్నాయి.


- అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలకు అనుమతిస్తారు.


- రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు.


- సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.


- దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.


- దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.


- సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.


- విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.



ఏళ్ల నాటి ప్రతిపాదన తిరిగి పునరావృతం కావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.