Ramanthapur Incident: హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కళాశాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన వ్యక్తి పక్కకు నిల్చున్న ఏఓ అశోక్ రెడ్డి తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ చనిపోయారు. కంచన్ బాగ్ లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఆదివారం రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థి సంఘ నాయకుడు సందీప్ సహా కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
నగరంలోని రామంతాపూర్ లోని నారాయణ కాలేజీలో సాయి నారాయణ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. ఆయన తండ్రి శేఖర్ జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తన కొడుకు చదువు కోసం నారాయణ కాలేజీకి రూ. 16 వేల ఫీజు కట్టాల్సి ఉంది. అయితే అందులో రూ. 10 వేలు మాఫీ చేస్తామని కళాశాల నిర్వాహకులు చెప్పారని శేఖర్ చెబుతున్నారు. ఈ లోగా నారాయణ కళాశాల నిర్వాహకులు మారిపోయారు. విద్యార్థి సాయి నారాయణ టీసీ కోసం రెండు మూడు రోజుల నుండి కళాశాలకు వెళ్తున్నారు. వారు మాత్రం బకాయి ఉన్న మొత్తం రూ. 16 వేలు కట్టాల్సిందేనని, అప్పటి వరకు టీసీ ఇచ్చేది లేదని కళాశాల నిర్వాహకులు తేల్చి చెప్పారు.
తిరగబెట్టిన ఫీజు మాఫీ వ్యవహారం..
ఫీజు మాఫీ చేస్తామని ముందు ఉన్న నిర్వాహకులు చెప్పారని చెప్పినా వారు పట్టించుకోలేదు. మొత్తం కట్టాల్సిందేనని అన్నారు. దీంతో సాయి నారాయణ మరో విద్యార్థి మురళీతో కలిసి విద్యార్థి నేత సందీప్ ను సంప్రదించారు. విద్యార్థుల తనను సంప్రదించడంతో సందీప్ ప్రిన్సిపల్ సుధాకర్ తో మాట్లాడేందుకు కళాశాలకు వెళ్లారు. మాట్లాడుతున్న సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు శేఖర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పథకం ప్రకారమే పెట్రోల్ తో వచ్చి..
అయితే పక్కా పథకం ప్రకారమే విద్యార్థి నాయకుడు సందీప్ పెట్రోల్ తో కాలేజీకి వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రామంతాపూర్ లో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి వద్ద ప్లాస్టిక్ బాటిల్ కొన్నారు. అందులో కొంత నీరు పోసి.. ఆ తరువాత సమీపంలోని బంకులో రూ. 80ల పెట్రోల్ నింపుకున్నారు. దానిని ప్యాంటు జేబులో పెట్టుకుని కాలేజీకి వెళ్లాడు సందీప్. విద్యాసంస్థ నిర్వాహకులను బెదిరించేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు విద్యార్థి నాయకుడు సందీప్. అలా పోసుకుంటున్న క్రమంలో.. వెనకే దేవుడి ముందు వెలిగించిన దీపంపై పెట్రోల్ చుక్కలు పడటంతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ముగ్గురికీ మంటలు అంటుకున్నాయి. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
సందీప్, ప్రిన్సిపాల్ పరిస్థితి ఎలా ఉంది..!
పెట్రోల్ పోసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఏవో అశోక్ రెడ్డికి మంటలు అంటుకోగా అతడిని కంచన్ బాగ్ లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి నాయకుడు సందీప్, కళాశాల ప్రిన్సిపలు సుధాకర్ రెడ్డి ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.