అనంతపురం జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఒక వ్యక్తిని నగ్నంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విడపనకల్లు మండలం చీకుల గురికి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చంద్రమోహన్ గత నెల 31వ తేదీ గ్రామ సచివాలయం ముందున్న వైఎస్ఆర్సిపి జెండాను తొలగించి జాతీయ జెండా కట్టాలని కోరాడు. దానికి ఒప్పుకోని వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వైసిపి కార్యకర్తలు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో చంద్రమోహన్ సచివాలయం ఎదురుగా ఉన్న వైసీపీ జెండాకి నిప్పుపెడతానని హెచ్చరించాడు.  


చంద్రమోహన్ హెచ్చరికతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఆయనతో తీవ్రంగా గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన చంద్రమోహన్ వైసీపీ జెండాను తీసి నిప్పుపెట్టబోయాడు. ఇదే విషయమై వైసీపీ కార్యకర్తలు పాల్తూరు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వెంటనే చంద్రమోహన్‌ని స్టేషన్‌కి తీసుకువచ్చారు. 


తనను స్టేషన్‌కి ఎందుకు తీసుకువచ్చారని చంద్రమోహన్ పోలీసులు ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. అడిగినందుకు చంద్రమోహన్‌ని చితకబాదారు. ఒంటిపై ఉన్న బట్టలు విప్పలని పోలీసులు చెప్పారని చంద్రమోహన్ వెల్లడించారు. పోలీసులు చెప్పిన విధంగానే ఒంటిపై ఉన్న బట్టలను విప్పానని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.


ఒంటిపై బట్టలు లేని తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని నగ్నంగానే స్టేషన్ ఆవరణంలోకి పరిగెత్తించారని ఆరోపిస్తున్నారు చంద్రమోహన్. అలా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన చంద్రమోహన్‌ని కొందరు వ్యక్తులు వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
పోలీసు దెబ్బలతో చంద్రమోహన్ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లాలోని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వ్యక్తిని నగ్నంగా ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి.