అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం జరిగింది. కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్ రూమ్‌లో తంబ్ వేసి వస్తుండగా కత్తితో గొంతు కోశాడు భర్త పరేష్. 


అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే లెక్చరర్‌పై ఆమె భర్త దాడి చేశాడు. చంపేందుకు యత్నించి విఫలమయ్యారు. ఉదయాన్నే కాలేజీ వచ్చిన సుమంగళి... ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్లి హాజరు వేసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఆమె భర్త పరేష్‌.. ఒక్కసారిగా దాడి చేశాడు. 


దాడి విషయం తెలుసుకొని తేరుకునే లోపు పరేష్‌... ఆమె మెడపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రవంతో అక్కడే పడిపోయారమే. దీన్ని చూసిన విద్యార్థులు.. పరేష్‌ను అడ్డుకోవడానికి యత్నించారు. వాళ్లంతా వస్తున్న సంగతి తెలుసుకొని అతను అక్కడి నుంచి పరారయ్యాడు. 


గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్న సుమంగళిని విద్యార్థులు, కాలేజీ స్టాఫ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణభయం లేదని వైద్యులు చెప్పారు. 


సుమంగళి, పరేష్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం బదిలీపై సుమంగళి ఈ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. అంతకు ముందు ఇరవై ఏళ్లపాటు గుంటూరులో ఆమె పని చేశారు. అనంతపురం వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా పరేష్‌తో విడిగా ఉంటున్నారు. 


అనుమానం కారణంగానే సుమంగళిపై పరేష్‌ దాడి చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థులు, స్థానికుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పరేష్‌ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.