Paravada Accident : అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీ లారెస్ కంపనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడినికి కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. నలుగురి కార్మికులు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరవాడ లారెస్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు రాంబాబు (ఖమ్మం), రాజేష్ బాబు (గుంటూరు), రామకృష్ణ (కోటపాడు), వెంకట్రావు (చోడవరం), సతీష్ అని గుర్తించారు.
తిరుమలలో ముగ్గురు మృతి
తిరుమలలో ముగ్గురు మృతి చెందారు. గుండెపోటుతో ఇద్దరు భక్తులు, ఒక టీటీడీ ఉద్యోగి మరణించారు. వీరిలో సురేష్ బాబు (40) టీటీడీ ఉద్యోగిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన కొత్తయండాళ్(63)గా మహిళ భక్తురాలు, హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. వారిని ఆశ్విణీ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలుస్తోంది.
మద్యం మత్తులో కారుతో బీభత్సం
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి అతి వేగంతో బస్ స్టాండ్ వద్ద బైక్ వెళ్తోన్న ఇద్దరిని ఢీ కొట్టారు. అక్కడ ఉన్న స్థానికులు కారును ఆపే ప్రయత్నం చేయగా అదే స్పీడ్ తో కారును బస్ స్టాండ్ ఆవరణలోనికి తీసుకెళ్లి లోపల మరో ఇద్దరు ప్రయాణికులను ఢీ కొట్టారు.
ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. తాంసి మండలంలోని హస్నాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడగా.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ - ఆంద్ బోరి నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైక్ ను తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇచ్చోడ మండలం కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన మనీషా(15), సంస్కార్ (11), వీరి తండ్రి మారుతి (40) మృతి చెందారు. తల్లి వందనకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. దీంతో అశోక్ నగర్ లో విషాదం అలుముకుంది. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.