Anakapalli Bank Theft : అనకాపల్లి జిల్లాలో పట్టపగలు బ్యాంకు దోపిడీ కలకలం రేపుతోంది. సినీఫక్కీలో బ్యాంకు దోపిడీ జరిగింది. తుపాకీతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి నగదు చోరీ చేశాడు దొంగ. హెల్మెట్ తో బ్యాంకులోకి వచ్చిన దుండగుడు సిబ్బందిని బెదిరించి డబ్బు దోచుకెళ్లాడు.  కసింకోట నరసింగబిల్లి గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.  సీసీ కెమెరాలో దోపిడీ దృశ్యాలు రికార్డు అయ్యాయి.  సింగిల్ గా తుపాకీతో వచ్చిన దుండగుడు దోపిడీ పాల్పడ్డాడు. 



గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ 


శుక్రవారం సాయంత్రం కశింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చోరీ జరిగింది. దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు. బ్యాంకుల్లోంచి రూ.3.30 లక్షలు లాక్కొని పరారయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు అవాక్కయ్యారు. ఈ దోపిడీపై బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం స్పెషల్ టీమ్ లతో గాలిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఖాతాదారుడిలా బ్యాగ్ తగిలించుకుని బ్యాంక్ లోకి ప్రవేశించాడు. హెల్మెట్‌, కోట్ ధరించి బ్యాంకు లోపలికి వచ్చాడని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. 


కడప జిల్లాలో చోరీలు


జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడ్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గణేష్ జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన గణేష్ జైలులో ఇతర ఖైదీలతో పరిచయం పెంచుకుని బయటకు వచ్చాక వారితో కలిసి మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. ఏప్రిల్ 1వ తేదీ ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ పరిధిలో ఉండే గరుడాద్రి నగర్ లో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దొంగతనానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. దొంగతనం చేసిన విధానాన్ని బట్టి హైదరాబాద్ కు చెందిన గణేష్ నిందితుడని తేలడంతో అతని కోసం గాలింపు చర్యలు  చేపట్టారు. అయితే హైదరాబాద్ లో ఇలాంటి దొంగతనం కేసులో జగన్నాథం అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు పట్టుకుని విచారించగా ప్రొద్దుటూరులో చేసిన దొంగతనం గురించి కూడా బయటపడింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు పీటీ వారెంట్ పై జగన్నాథంను  తీసుకువచ్చి విచారించారు. జగన్నాథం, గణేష్ కలిసి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుడి నుంచి 18 తులాల బంగారు, 310 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న గణేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.