Anakapalle News: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడకలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై కోడికత్తితో దాడి చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన 26 ఏళ్ల నానాజీ చాలా ఏళ్లుగా ఓ అమ్మాయి వెంట పడుతున్నాడు. అయితే ఆ యువతిది కూడా అదే గ్రామం. చదువుకునే రోజుల నుంచి ప్రేమిస్తున్నానంటూ ఆమె వెనకాల తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటానంటూ చెప్పేవాడు. కానీ ఆ అమ్మాయికి ఇతడంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని అతడితో చాలా సార్లు చెప్పింది. అయినా అతడు పట్టించుకోకుండా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడం వంటవి చేసేవాడు. ఇక ఇతని వేధింపులు భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తమ కూతురును ఎలాగైనా అతడి నుంచి రక్షించాలనుకున్న యువతి తల్లిదండ్రులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. మరోసారి ఆమె జోలికి వెళ్లకుండా గ్రామపెద్దలు నానాజీని మందలించి వదిలేశారు.
దీంతో నానాజీ అమ్మాయిపై కక్షపెంచుకున్నాడు. ఎంతగా వెంటపడినా యువతి లొంగకపోవడంతో ఈ నెల 12వ తేదీన అతడు కోడికత్తితో యువతిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనలో సదరు యువతి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె కేకలతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు రావడం గుర్తించిన నానాజీ తప్పించుకొని పారిపోయాడు. అయితే వీరంతా వెళ్లే సరికి యువతి తీవ్ర గాయాలతో కింద పడి ఉంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పది రోజుల క్రితం గుంటూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డెంటల్ విద్యార్థినిపై ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. తపస్వి అనే విద్యార్థినిపై దాడి చేసిన జ్ఞానేశ్వర్ ఆ తర్వాత తన చేయి కోసుకున్నాడు. జ్ఞానేశ్వర్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి మృతి చెందింది. అయితే నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పెదకాకాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడు జ్ఞానేశ్వర్ అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
విజయవాడకు చెందిన జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తపస్వితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తక్కెళ్లపాడులోని ఓ డెంటర్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు రమ్మని పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్ద ఉంటుంది. తపస్విపై పగపెంచుకున్న జ్ఞానేశ్వర్ ఆమె హతమర్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ఇద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు ఉన్మాదిలా మారిపోయి తపస్విపై దాడి చేసి సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడు. పక్కనున్న తపస్వి స్నేహితురాలు కేకలు వేసి బయటకు పరిగెట్టడంతో స్థానికులు వచ్చారు. దీంతో తలుపులు మూసేసి కొనఊపిరితో ఉన్న తపస్విని రక్తపు మడుగులో ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి తపస్విని ఆసుపత్రికి తరలించారు. తపస్వీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. తపస్వీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. తపస్వీపై సర్జికల్ బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేసిన తరువాత, తాను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.