Hyderabad News : హైదరాబాద్‌ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.  తాజాగా నార్సింగిలో మిట్టమధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ 20 రోజుల క్రితమే దుబాయ్ నుంచి నగరానికి వచ్చాడు. ఈరోజు నిర్మానుష్య ప్రాంతానికి క్వాలీస్ వాహనంలో ఇజాయత్ అలీని తీసుకొచ్చి గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలీస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 


ఇద్దరు కాళ్లు పట్టుకోగా.. ఒకరు గొంతు కోసి..
 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడి కిలాడి వచ్చి నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇంజనీర్ కాళ్లు పట్టుకొగా మరొకరు అతడిని కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే.. హత్య అనంతరం దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే హుటాహుటిన నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు.. ‌పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.  అయితే ఇంజినీర్ అలీ ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొని వచ్చారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  క్వాలీస్ కారు తో పాటు రెండు ఫోన్లను నార్సింగి పోలీసులు సీజ్ చేశారు.  


చాదర్ ఘాట్లో రౌడీ షీటర్ హత్య
ఇది ఇలా ఉంటే చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో పేట్ మెట్రో స్టేషన్ దగ్గర శుక్రవారం అర్థరాత్రి రౌడీ షీటర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.  చనిపోయిన వ్యక్తి  రెయిన్ బజార్ కు చెందిన సయ్యద్ నజఫ్ అలీ అనే రౌడీ షీటర్ గా గుర్తించారు పోలీసులు. సయ్యద్ నజఫ్ అలీ పై మూడు మర్డర్ కేసులు ఉన్నాయి. కానీ.. 2021 నుంచి అతడు ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడలేదు. కానీ.. నజఫ్ అలీపై గుర్తు తెలియని వ్యక్తులు చాదర్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి చంపేశారు.  ఇదే విధంగా బేగంపేటలో గురువారం కూడా మరో హత్య జరిగింది. వరుస హత్యలతో హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ నగరంలోని ఏదో ఒక మూల వెలుగుచూస్తూనే ఉన్నాయి.