అతనో సామాన్య ఎలక్ట్రీషియన్.. కష్టపడి పని చేసి లైఫ్‌ను లీడ్ చేద్దామనుకున్నాడు. ఎంత కష్ట పడినా వచ్చేది సరిపోలేదు. అందుకే ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అందుకే దొంగతనాలు షార్ట్ కట్‌గా మార్చుకున్నాడు. రోజూ దొంగతనాలు చేస్తే లాభం లేదనుకొని... ఒక్క దొంగతనంతో లైఫ్‌ సెట్‌ అయిపోవాలని స్కెచ్ వేశాడు. దొంగతనం చేసిన డబ్బుతో సొంతంగా జిమ్ పెట్టి కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని దర్జాగా జీవించాలని అనుకున్నాడు. ప్లాన్ చేసుకున్న విధంగానే దొంగతనం చేశాడు. 75 లక్షల వరకూ నొక్కేశాడు.


తిరుపతిలోని ఇర్లానగర్‌కు చెందిన రాజేష్ ఐటీ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా స్ధిర పడ్డాడు. చదువుకున్న చదువుకు చేసే పనికి సరైన వేతనం రాక పోయే సరికి తీవ్ర మనోవేదనకు గురి అయ్యాడు. ఇక ఎన్నాళ్ళు కష్ట పడిన ఎదుగు బొదుకు ఉండదని ఆలోచించాడు. ఒక్కసారిగా జీవితంలో స్ధిర పడేందుకు అనేక ఆలోచనలు చేశాడు. ఏవీ తనకు అనుకూలంగా లేక పోవడంతో  దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాడు. దొంగగా మారడం ఇష్టం లేని రాజేష్ అయిష్టంగానే ఒక్కే ఒక్క దొంగతనం చేయాలని భావించాడు. చేసే దొంగతనం కూడా ఒక్కేఒక్కసారి అయి ఉండి జీవితంలో స్ధిర పడి పోవాలని ప్లాన్ వేసుకున్నాడు.. అయితే దొంగతనం చేసినా కూడా పోలీసులకు దొరక్కకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 


ఎలక్ట్రీషియన్‌గా తనకున్న పరిచయాలతో తమ వీధిలో ఉన్న రెండు కుటుంబాలను ఎంచుకున్నాడు. ఆ రెండు కుటుంబాలతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. వారు ఏ సమయానికి ఎక్కడికి వెళ్తారో తెలుసుకున్నాడు. రాజేష్ అదృష్టం ఏమో గానీ తాను స్నేహం చేసిన ఇద్దరు ఇంటి యజమానులు ఒకేసారి బయటి ఊరు వెళ్ళారు. అదే అదునుగా భావించిన రాజేష్ తన ప్లాన్ వర్కౌట్‌ చేశాడు. 


ఈ నెల‌13 అర్ధరాత్రి రెండు ఇళ్లలోకి చొరబడ్డాడు. 75 లక్షల రూపాయల విలువల గల 1610 గ్రాముల‌ బంగారం, 3 కేజీల వెండి, 5 లక్షల రూపాయల నగదు అపహరించాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చినా యజమానులు తమ ఇంటిలో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్ధలానికి రావడంతో ఏమీ ఎరుగనట్టుగా ఆ రెండు ఇళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దొంగతనం జరిగిందా అంటూ సానుభూతి చూపిస్తూ అక్కడ జరిగేవి అన్ని గమనించాడు. ఇంటి యజమానుల ఫిర్యాదుతో పోలీసు క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఆధారాలను సేకరించారు. ఇంటి యజమానులతో సన్నిహితంగా ఉండే వారి వేళ్ళు ముద్రలను పోలీసులు సేకరించారు. దీంతో రాజేష్ గుట్టు రట్టు అయ్యింది. 


ఎలక్ట్రీషియన్ రాజేషే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. రాజేష్ రోజు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దగ్గర నుంచి మొత్తం సొత్తును తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తులు మాయ మాటలు చెప్పి పరిచయం చేసుకుంటే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని, ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు స్ధానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు..