సోషల్‌ మీడియాలో కొందరుచేస్తున్న అతి వల్ల అనేక అనర్ధాలు ఎదురవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌ ఇలాంటి సామాజిక మాధ్యమాల వేదికల్లో పరిచయం అవుతున్నవారితో చేస్తున్న స్నేహం ముదిరి హద్దులుదాటి అనేక నేరాలకు తావిస్తోంది. స్నాప్‌చాట్‌లో పరిచయం ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమగా మారి అదికాస్త దూరమైతే ఉన్మాదిగా మార్చింది.


సరిగ్గా ఇలాగే స్నాప్‌చాట్‌లో పరిచయం అయిన ఓ వివాహితను ప్రేమించిన వ్యక్తి ఆమె తనతో మాట్లాడడం తగ్గించేసిందని ఉన్మాదిగా మారాడు. ఏకంగా నెల్లూరు నుంచి అమలాపురం వెతుక్కుంటూ వచ్చి ఓ మహిళను చంపి, మరో మహిళపై దాడిచేసేలా చేసింది. ఇందులో ఏమాత్రం సంబందం లేని మహిళ.. సైకో చేతిలో బలైపోయింది. సంచలనం రేకెత్తించిన అమలాపురంలో ఇద్దరు మహిళలపై దాడి కేసులో 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి దాడి వెనుక కారణాలను వెల్లడించారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి ఈ ఘటనకు సంబందించి దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఓ ప్రకటనలో వివరించారు.


స్నాప్‌చాట్‌లో పరిచయం అయిన ఆమె ఎవరు..?
అమలాపురం ఏఎంజీ కాలనీకు చెందిన వివాహితకు అయిదు నెలల క్రితం స్నాప్‌చాట్‌లో నెల్లూరుకు చెందిన కోట హరికృష్ణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్న క్రమంలో స్నేహం పెరిగింది. అయితే హరికృష్ణ కొన్ని రోజుల నుంచి వివాహితను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడని, అతనిలో వచ్చిన మార్పు వల్ల ఫోన్‌మాట్లాడడం తగ్గించి, అలాగే స్నాప్‌చాట్‌లో చాట్‌చేయడం తగ్గించిందని తెలిపారు. హరికృష్ణ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు చేసినా రిప్లై ఇవ్వకపోవడంతో ఆమె ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసినప్పుడు చెప్పిన అడ్రస్‌ వివరాలు ప్రకారం మంగళవారం ఉదయం అమలాపురం వచ్చాడు.


నెల్లూరు నుంచి అమలాపురం వచ్చి..
తనను పూర్తిగా పట్టించుకోవడం మానేసిన వివాహితను అంతంచేయాలన్న పగతో నెల్లూరు నుంచి అమలాపురం మంగళవారం ఉదయం చేరుకున్న నిందితుడు హరికృష్ణ మొదట ఎర్రవంతెన వద్దకు చేరుకుని విత్తనాల కాలువగట్టు వద్ద పూటుగా మద్యం సేవించాడు. ఆ తరువాత బస్టాండ్‌ సమీపంలోని శ్రీదేవి బార్‌అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం సేవించి చాటింగ్ లో భాగంగా ఆమె చెప్పిన అడ్రస్‌ ప్రకారం ఏఎంజీ కాలనీలోని ఇంటివద్దకు వెళ్లిన హరికృష్ణకు బిల్డింగ్‌పై బట్టలు తీస్తున్న ఆమె తల్లిని గతంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన ఫోటోల ఆధారంగా గుర్తించాడు. అక్కడే మరో మహిళ ఉండడం గమనించిన నిందితుడు ఆమె తాను ప్రేమించిన వివాహితగా భావించి బిల్డింగ్‌పైకి ఎక్కి వెనుక నుంచి తన వెంట తెచ్చుకున్న చాకుతో హతురాలు మన్నె శ్రీదేవి కంఠం వద్ద బలంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటరమణ తనను గుర్తుపడుతుందని ఉద్దేశ్యంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈఘటనలో అన్నెంపున్నెం ఎరుగని మన్నె శ్రీదేవి మృత్యువాతపడింది.


పదిహేనేళ్లుగా పనిచేస్తూ మృత్యు ఒడికి..
ఈ ఘటనలో మృత్యువాత పడిన మన్నె శ్రీదేవి.. సైకో ప్రేమించిన వివాహిత పుట్టింటివద్ద గత పదిహేనేళ్లుగా ఇంటి పనిచేస్తోంది. మద్యాహ్నం 3 గంటలకు వచ్చి పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లిపోతుంది. మృతురాలు శ్రీదేవి  భర్త అమలాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యకార్మికునిగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం కాగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన నిందితుడు కోట హరికృష్ణను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌ సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి సిబ్బంది దర్యాప్తు చేశారు.