Bandi Sanjay Arrest: పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ ను అర్ధరాత్రి పోలీసులు నిర్బంధించి అరెస్టు చేయడాన్ని తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఖండించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావులు ఈ ఘటనపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం పార్లమెంట్ హౌస్ ఎదుట ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్ష నేతలను అణిచివేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను రాష్ట్ర అధ్యక్షున్ని అమానుషంగా అరెస్ట్ చేయడం దుర్మార్గ పాలనకు నిదర్శమని పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ లకు బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన సీఎం కేసీఆర్.. ప్రజాస్వామ్యం తలదించుకునేలా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజల కోసం పోరాడే నాయకులను అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. ఫాసిస్టు చర్యలకు నిరసనగా నినాదాలు చేశారు. 






లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు 
అనంతరం బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం ముగ్గురు ఎంపీలు సభ హక్కుల ఉల్లంఘన నోటీసు కింద ఫిర్యాదు చేశారు. ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే హౌస్ కు వెళ్లనివ్వకుండా ఒక ఎంపీ బండి సంజయ్ ని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసుల తీరుపై ప్రభుత్వ వైఖరి పై వారు నిరసనగా ఫిర్యాదు చేశారు.










మరోవైపు టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను ఏ 1 గా చేర్చుతూ పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఏ-2గా బూర ప్రశాంత్, ఏ -3 గండబోయిన మహేష్ , ఏ - 5గా శివగణేష్‌లను చేర్చారు. ఏ -10 వరకూ పోగు సుభాష్, పోగు శశాంక్, శ్రీకాంత్, షర్మిక్, వర్షిత్ వంటి వారిని చేర్చారు. అయితే ఏ - 4 ఎవరన్నది మాత్రం రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదు. ఏ -4 నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదు. ఎస్సెస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేయాలని బండి సంజయ్ కుమార్.. ప్రశాంత్, మహేష్‌లతో కలిసి కుట్ర చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.