Amalapuram Postal Division: కోనసీమ జిల్లా... అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలోని పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన కోటి రూపాయలకు పైగా నిధులు గోల్ మాల్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధుల గోల్‌మాల్ కేసులో సూత్రధారి పోస్టల్ ఉద్యోగి కాగా, పోస్టల్ అధికారుల ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలు ఉమోయోగించి తన బ్యాంక్ అకౌంట్లకు నిధులు మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయినవిల్లి మండలం విలస పోస్టాఫీస్‌లో ఒక్క రోజులోనే 40 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
విలస పోస్ట్ మాస్టర్ ఐడీ పాస్‌వర్డ్, పోస్టల్ ఉన్నతాధికారుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు వాడి నిధులు డిపాజిట్ చెయ్యడం, తమ బ్యాంక్ ఖాతాలకు జమ చెయ్యడం వంటి సీక్రెట్ లావాదేవీలు నిర్వహించారు. పోస్టల్ శాఖలో ఒక వ్యక్తి అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో 40 లక్షల రూపాయల లావాదేవీలు ఒక్క రోజులో చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
నగదు బదిలీలు జరిగిన ముమ్మిడివరం, రామచంద్రాపురం బ్యాంక్ లలో కూడా పోస్టల్ ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలోని ఒక ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విలస పోస్ట్ ఆఫీసుకు పర్యవేక్షణ అధికారిగా కొత్తపేటలో సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇతని పర్యవేక్షణ లోపమా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది.
కేవం ఒక్క వ్యక్తి ఇంత భారీ మొత్తంలో సొమ్ము కాజేయటం కుదరని పని అని, ఇందులో మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా కేలం ఒక్క విలస పోస్ట్ ఆఫీస్ లోనే జరిగిందా... ఇంకా డివిజన్ లోని ఇతర పోస్ట్ ఆఫీస్‌లలో కూడా జరిగాయా అనేది విచారణలో తేలాల్సి ఉంది. నిధుల గోల్‌మాల్ పై పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణను వివరణ కోరగా నిధుల మళ్లింపుపై పోస్టల్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. అధికారుల ఐడి పాస్ వర్డ్‌లు ఎవరు వినియోగించారనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఖాతాదారుల సొమ్ము భద్రం..
పోస్టాఫీసు ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బు భద్రంగా ఉందని, పోస్టల్ బ్యాంక్ సొమ్ముతో లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ పనితీరు బాగోలేదని ఇటీవల అమలాపురం ఎంపీ చింతా అనూరాధ పోస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక ఎంపీ అనుచరునిగా ఉంటూ పోస్టల్ శాఖలో చక్రం తిప్పే ఉద్యోగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలో రూ. కోటి పైగా నిధులు గోల్ మాల్ నిందితుల బాగోతం బయటపడనుంది.