Alluri District News : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాలమూరు వాగులో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కోనసీమ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.  కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు  గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి వీక్షించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వాలమూరు వాగులో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో కాళిదాస్ సందీప్ 20 సంవత్సరాలు, దాన అరుణ్ కుమార్ 22 సంవత్సరాలు వాగులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక సీఐ అద్దంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాము గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక యువకులు, గ్రామస్తులు వాగులో సుమారు గంటసేపు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి పంచనామా కోసం తరలించారు స్థానిక ఎస్సై ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


సముద్ర స్నానానికి వెళ్లి


బాపట్ల జిల్లాలో ఇటీవల విషాద ఘటన చోటుచేసుకుంది. నిజాంపట్నం వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి బోటులో 40 మంది బంధువులు విహారయాత్రకు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో నలుగురు చిన్నారులు సముద్రంలో పడిపోయారు. వారిలో ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరో బాలుడిని రక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిజాంపట్నం వద్ద సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. హార్బర్ నుంచి బోటులో సముద్రంలోకి 40 మంది బంధువులు వెళ్లారు. తెనాలి నుంచి సముద్ర స్నానానికి వీళ్లంతా నిజాంపట్నానికి వెళ్లారు. స్నానాలు చేస్తుండగా ఉద్ధృతమైన అలలు రావడంతో  ఆ అలల తాకిడికి నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఒక పాప మృతదేహం లభ్యం అయింది. కొట్టుకుపోతున్న బాలుడ్ని వెలికితీశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారికోసం మేరైన్ పోలీస్‌, ఎన్డీఆర్ఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 


బాపట్లలో 


బాపట్ల జిల్లా సూర్యలంకలో అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏరువాక పౌర్ణమి కావడంతో సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని మెరైన్ పోలీసులు పర్యాటకులను హెచ్చరించారు. అయినా కొందరు యువకులు సముద్రంలోకి వెళ్లడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తెనాలికి చెందిన ఏడుకొండలు, చినగంజాం మండలం ములగానివారిపాలేనికి చెందిన హారీష్ రెడ్డి పోలీసులు గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.