రెండు రోజుల కిందట తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు విచారణలో భాగంగా అన్ని వివరాలు రాబట్టారు. వివాహిత ప్రవర్తన నచ్చకనే ఆమెతో పాటు ఆమె ప్రియుడ్ని భర్త దారుణంగా హతమార్చాడు అని వివరించారు.
గుడిహత్నూర్ మండలం సీతాలగోంది గ్రామ శివారులో ఓ వ్యవసాయ భూమిలో రహమాన్, అశ్విని జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. అశ్విని ప్రవర్తన నచ్చక ఆమె భర్త రమేష్ హత్య చేసినట్లు పేర్కొన్నారు. వివాహేతర సంబంధమే జంట హత్యకు కారణమని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిపారు.
పుట్టింటికి వెళ్లిన ఆమెకు రెహమాన్ తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా తెలిపారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలో స్థానిక పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎస్పి నాగేందర్, సిఐలు నైలు, చంద్రమౌళి, ఎస్సైలు ఉన్నారు.
పొలంలో యువతి, యువకుడి మృతదేహాల కలకలం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది శివారులో దారుణం జరిగింది. పంట పొలాల్లో యువతీ యువకుల రెండు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సితాగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ఓ జంట విగతజీవులుగా కనిపించారు. ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారని ఆదివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ మృతులు ఆదిలాబాద్ కు చెందిన రహమాన్, ఓ యువతిగా గుర్తించారు. వీరి మరణానికి వివాహేతర సంబంధమే కారణం కావచ్చని పోలిసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వివరాల కోసం స్థానికులను ఆరా తీస్తున్నారు.
వీరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ హత్య ఎవరు చేసుంటారనే కోణంలోను పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 3 రోజుల కిందటే వీరు చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల కిందట సీతాగోంది గ్రామంలోని సీసి కెమెరాల్లో ఈ ఇద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆద్వర్యంలో స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇది హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఉట్నూర్ డిఎస్పి నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ... సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీం ద్వారా సాక్ష్యాలు సేకరించారన్నారు. పోలీసుల విచారణలో వీరిద్దరిది హత్య అని తేలింది.