Adibatla Kidnap Case : హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సంచలనం అయింది. ప్రేమించిన యువతి మరొకరితో పెళ్లికి సిద్ధమవ్వడంతో ఆమెను కిడ్నాప్ చేశాడు యువకుడు. అయితే ఆ కిడ్నాప్ కూడా సినీఫక్కీలో చేశారు. వంద మంది అనుచరులతో యువతి ఇంటిపై దాడి చేసి తండ్రిని కొట్టి యువతిని కిడ్నాప్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


రిమాండ్ రిపోర్టులో సంచలనాలు 


బొంగులూరులోని స్పోర్ట్స్‌ అకాడమీలో చదువుతున్న యువతికి నవీన్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. నవీన్‌ రెడ్డి యువతి ఫోన్ నంబర్‌ తీసుకొని తరచూ ఫోన్ చేసేవాడు. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకునేవాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు నవీన్. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పింది. అయితే యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్‌ రెడ్డి ప్రయత్నించాడు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో వారిపై నవీన్‌ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్ క్రియేట్ చేశాడు. యువతితో కలిసి దిగిన ఫొటోలు పోస్టు చేస్తూ వైరల్ చేసేవాడు. ఆరు నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు నవీన్ రెడ్డి. ఇన్ స్టాలో నకిలీ ఖాతా గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆదిభట్ల పోలీసులు ఐటీ చట్టం కింద నవీన్‌పై కేసు నమోదు చేశారు.  


పరారీలో నవీన్ రెడ్డి! 


యువతికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలుసుకున్న నవీన్‌... తన అనుచరులతో మన్నెగూడలో ఆమె ఇంటికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. యువతి ఇంటిపై నవీన్ అనుచరులు, టీ స్టాల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి తండ్రిపై దాడి చేశారు. ఇంటి ముందు నిలిపిన 5 కార్ల అద్దాలను బద్దలుగొట్టారు. యువతి ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేశారు. యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ కారులో నల్గొండ వైపు తీసుకెళ్లాడు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్.. నల్గొండ వద్ద ఆమెను వదిలేసి పరారయ్యారు. నవీన్‌ స్నేహితుడు యువతిని కారులో హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. ఘటన జరిగిన సాయంత్రం నెల తాను క్షేమంగా ఉన్నట్లు యువతి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఈ దాడిపై యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్టైనట్లు వార్తలు వచ్చాయి కానీ నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.