క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి చేసిన వ్యక్తి అప్పులు తీర్చేందుకు దొంగతనాలు మొదలుపెట్టాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినప్పటికీ బెట్టింగ్స్ లో నష్టపోయి అప్పులు చేయడంతో, బాకీలు తీర్చేందుకు చోరీలకు పాల్పడుతున్న యువకుడ్ని అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. 


శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతానికి చెందిన సావణ మనోజ్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ప్రగతి నగర్ లేక్ యు కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడి దొరికిన చోటల్లా అప్పులు చేసేవాడు. ఐదు నుంచి 10 శాతం వడ్డీలకు అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ లో పెట్టి నష్టపోయాడు. ఆ అప్పులను తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. 


గత నెల 31వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో నిజాంపేట్ శ్రీనివాస కాలనీ శ్రీ బాలాజీ రెసిడెన్సి లోని వృద్ధురాలు స్వర్ణలత సాయిబాబా ఆలయానికి వెళ్లింది. పూజ అనంతరం ఇంటికి వస్తుండగా దారిలో ఇల్లు అద్దెకు కావాలని అడుగుతూ వెంబడించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ కుమార్.. ఇంటి వద్ద లిఫ్ట్ దగ్గర గొలుసు తెంచుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శశిగూడ వద్ద అదుపులోకి తీసుకొని మియాపూర్ లో దొంగిలించిన స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని తరలించారు.


నిందితుడు ఎలా దొరికాడంటే..
కూకట్ పల్లి డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాచుపల్లి పరిధిలోని నిజాంపేట ఏరియాలో జనవరి 31న చైన్ స్నాచింగ్ జరిగింది. స్వర్ణలత అనే పెద్దావిడ సాయిబాబా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మనోజ్ కుమార్ ఆమెతో మాటలు కలిపాడు. అద్దెకు ఇల్లు కావాలని అడగగా, ఏ ఇల్లులు ఖాళీ లేవని చెప్పినా ఆమెను వెంబడిస్తూ అపార్ట్ మెంట్ కు కూడా వెళ్లాడు. ఆమె లిఫ్ట్ ఎక్కడగానే గ్రిల్ పక్కకు జరిగి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడని తెలిపారు. 


బాధితురాలు స్వర్ణలత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నిజాంపేట ఏరియాలో ఓ యువకుడు బంగారు గొలుగు అమ్మే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. జనవరి 31న చోరీకి గురైన మహిళ స్వర్ణలత బంగారు గొలుసు ఇదేనని తేలింది. హోండా మ్యాస్ట్రో వాహనాన్ని సైతం 2017లో చోరీ చేశాడని, దానిపై వెళుతూ చోరీలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు మనోజ్ కుమార్ పై ఇంకా ఏమైనా కేసులు నమోదయ్యాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తామని చెప్పారు. నిందితుడి పేరు మనోజ్ కుమార్ అని, మాదాపూర్ ఏరియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నాడని పోలీసులు వివరించారు. అప్పులు తీర్చుకోవడం, ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడని చెప్పారు.