Telangana ACB Raids | హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన ఇళ్లు, కూతురి ఇల్లు, సంబంధించిన మరో రెండు ఇళ్లు, సీసీఎస్ ఆఫీసు, సన్నిహితుల ఇళ్లలో, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు మంగళవారం (మే 21న) సోదాలు నిర్వహించారు. అనంతరం సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు మీడియాకు వెల్లడించారు.
ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు
మంగళవారం ఉదయం హైదరాబాద్ కమిషనరేట్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆరోపణలు రావడంతో ఏసీపీ సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేసినట్లు తెలిపారు. 17 ప్రాపర్టీ లను గుర్తించాము. అందులో ఘట్‌కేసర్ ప్రాంతంలో 5 ప్లాట్స్ గుర్తించాం. 38 లక్షలు నగదుతో పాటు 60 తులాల బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు సీజ్ చేసిన వాటి మార్కెట్ విలువ ప్రకారం 3.5 కోట్లు పైగా ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ మరింత అధికంగా ఉంటుందని తెలిపారు. ఏపీలోని విశాఖ సమీపంలో చౌడవరం వద్ద 7 ప్రాపర్టీలు, శామీర్ పేట, కూకట్ పల్లి, మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని గుర్తించినట్లు వివరించారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి బుధవారం ఉమా మహేశ్వరరావును కోర్టులో ప్రవేశ పెడుతామని చెప్పారు.
సందీప్ రావు అనే పోలీస్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయని సైతం ప్రచారం జరిగింది. అయితే సందీప్ అనే వ్యక్తికి సంబంధించిన పత్రాలు దొరికాయని, అయితే పోలీసా కాదా ఇంకా స్పష్టత లేదన్నారు. పూర్తి స్థాయి విచారణ చేపడితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
కేసుల్లో పురోగతి లేకపోవడంతో అనుమానం..
ప్రీ లాంచ్ పేరుతో అమాయకులను వందల కోట్లు మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ చీటింగ్ కేసును ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణ చేస్తున్నారు. ఇంత పెద్ద కేసు అయినా, ఇందులో పెద్దగా పురోగతి లేకపోవడంతో విచారణాధికారిపై పలు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్ సహా 10 చోట్ల ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. ఏపీలోనూ విశాఖ సమీపంలో ప్రాపర్టీస్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా చేసిన సమయంలోనూ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. డబుల్ మర్డర్ కేసు నిందితుడి నుంచి ముడుపులు తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి.