Vizag Crime News : అది విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్. ఓ యువతి కాస్త వేగంగా బయటకు వచ్చింది. ముందే ప్లాన్ చేసుకుందో లేకపోతే ఆవేశంలో ఉన్న ఆమెకు అక్కడ దొరికిందో కానీ ఒంటి మీద పెట్రోల్ పోసుకుంది. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల జనం అనుకునలోపే అంటించేసుకుంది. దీంతో జనం ఒక్క సారిగా షాక్ అయ్యారు. లోపల నుంచి ఎస్ఐ వేగంగా వచ్చి మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆయన చేతులూ కాలాయి. చివరికి ఎలాగోలా మంటల్ని ఆపి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె ప్రాణం నిలబడలేదు. అసలు ఎవరామే ? పోలీస్ స్టేషన్ ముందే ఎందుకు ఆత్మహుతి చేసుకుంది ? ఈ వివరాలు తెలియాలంటే ఓ నాలుగునెలల ముందు ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్లాలి.
నాలుగు నెలల కిందట గుంటూరులో !
గంటూరుకు చెందిన శ్రావణి.. విశాఖకు చెందిన వినయ్‌తో ఘనంగా పెళ్లి చేశారు కుటుంబీకులు. ఇద్దరి అనుమతితోనే పెళ్లి జరిగింది. కుటుంబసభ్యులందరూ హ్యాపీ ఫీలయ్యారు. తర్వాత రెండు కుటుంబాలు బాగానే ఉన్నాయి. తర్వాత విశాఖలో కాపురం పెట్టారు. కానీ దూరంగా ఉన్నప్పుడు బాగున్న వినయ్ - శ్రావణి దంపతులు... దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం మనసుల్ని కలుపులోకపోయారు. ఒకరి మాటలు మరొకరికి సూటిపోటిగా తగలడం ప్రారంభమైంది. చివరికి శ్రావణి భరించలేకపోయింది. కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
శుక్రవారం విశాఖలో !
అలా శ్రావణి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిబంధనల ప్రకారం ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నారు. అందుకే భార్య భర్తలు ఇద్దర్నీ పలిచారు. ఎస్ ఐ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఈ లోపు వారి మధ్య మళ్లీ మాటా మాటా పెరిగింది. చివరికి వినయ్ అన్న మాటలకు మరోసారి హర్ట్ అయిన శ్రావణి వెంటనే ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లు పూర్తిగా కాలిపోవడంతో చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.
పోలీసుల అదుపులో భర్త !
ఎస్ఐ కూ గాయాలు కావడంతో... వెంటనే అయననూ ఆస్పత్రికి తరలించారు. శ్రావణి భర్త వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వినయ్, శ్రావణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రావణి ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తోందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకుందని.. కలిసి జీవించడం ఇష్టం లేకపోతే ... విడాకులు తీసుకుంటే సరిపోయేదని ఆమె బంధువులు విలపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే ఒకరు ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం సంచలనం సృష్టించింది.
భార్య భర్తల మధ్య వివాదాలు చేసేందుకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అనేక మంది జంటల్ని కలుపుతున్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం తమ మధ్య ఏర్పడిన అపోహలను తొలగించుకోవడం కన్నా పెంచుకుంటున్నాయి. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఊహించలేకపోతున్నారు.