Challan Tragedy : బండి పాతతే అయినా అదే బతుకు బండి. అలాంటి బండిని పోలీసులు లాక్కుకున్నారు. బండిపై చలాన్లు ఉన్నాయని కట్టి తీసుకుపోవాలని ఆదేశించారు. చలాన్ల మొత్తం కలిపితే పది వేలు. తాను ఆ బండిని సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కున్నానని..అంత సొమ్ము లేదని ట్రాఫిక్ పోలీసుల్ని బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. ఆ బండి లేకపోతే తాను బతకడం దండగనుకున్నాడు. ప్రాణాలు తీసుకున్నాడు. అంటే ట్రాఫిక్ చలాన్లు ఆ వ్యక్తి ప్రాణం తీశాయి. హైదరాబాద్ శివారులోఈ ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య , మల్లమ్మ దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ చింతల్ బస్తీ లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు. ఎల్లయ్య హమాలీ పనికి వెళ్లి వస్తున్న సమయంలో మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్సై ఆపారు. పలు చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో సీజ్ చేశారు. కూలీ పనులు చేసుకుని బతుకుతున్న తాము అప్పు చేసి బైక్ కొన్నామని, రూ.10 వేలు చలాన్లు రాస్తే ఎలా చెల్లించగలమని ఎల్లయ్య ఎంత బతిమాలుకున్నా ప్రయోజనం లేకపోంది.
దీంతో ఎల్లయ్య ప్రాణం తీసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్‌డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్సై గణేశ్ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. నిరుపేదల వాహనాలపైనా వేల రూపాయల చలాన్లు విధిస్తే ఎలా బతకాలని దయతో అలోచించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సూసైడ్ నోట్‌లో విజ్ఞప్తి చేశాడు. చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్ ఎస్సై చెప్పాడని, కూలీ పనులు చేసుకునే తనకు అంత సొమ్ము చెల్లించలేనని ఎంత బతిమాలినా వినలేదని, పైగా టార్చర్ పెట్టాడని సూసైడ్ నోట్‌లో రాశాడు. విచ్చలవిడిగా వేస్తున్న చలాన్లతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు.
మొదట కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపిన పోలీసులు, సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కేసును మార్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఎల్లయ్య మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య అతని స్వగ్రామానికి తరలించారు. ఇలాంచి చలాన్ల విషయంలో ఇబ్బంది పడే పేదలు ఎంతో మంది ఉన్నారు. అయితే బండి వదిలి పెట్టి వెల్లడం లేకపోతే డబ్బులు కట్టడం అన్నట్లుగా పోలీసుల వేధింపులు ఉంటాయన్న ఆరోపమలు ఉన్నాయి.