Guwahati Murder Case: గౌహతిలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్లో పూణేకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోని గదిలో అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అసోం పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను  పట్టుకున్నారు. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన యువతితోపాటు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా... ఈ కేసులో సంచలన విషయాలు బటయపడ్డాయి. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ హత్యకు కారణమైందని పోలీసులు చెప్తున్నారు.  హత్యకు గురైంది నిందితురాలు అంజలిషా మాజీ ప్రియుడు సందీప్‌ కాంబ్లీ (42)గా గురించారు. అంజలిషా, ఆమె ప్రియుడు బికాశ్‌షా(27)లు కలిసి... సందీప్‌ కాంబ్లీను హత్య చేసినట్టు నిర్ధారించారు. అంజలితో సన్నిహితంగా ఫొటోలను చూపించి  సందీప్‌ బెదిరించడం వల్లే... హత్య చేసినట్టు చెప్తున్నారు. హత్య తర్వాత... నిందితులిద్దరూ కోల్‌కతా పారిపోయేందుకు ప్లాన్ చేశారని... అంతలోనే తాము పట్టుకున్నామని అంటున్నారు గౌహతి పోలీసులు. ఈ మర్డర్ కేసును పోలీసులు ఎలా  ఛేదించారు? పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలింది? అసలు విషయం హత్య వరకు ఎలా వెళ్లింది..? 


అసలు ఏం జరిగిందంటే...?
సందీప్ కాంబ్లీ పూణెలో కార్ డీలర్‌గా పనిచేసేవాడు. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న అంజలిషాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. అయితే, అంజలికి అప్పటికే బికాష్ షా అనే  మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అంజలిపై ప్రేమ పెంచుకున్న సందీప్‌.. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ.. అంజలి అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు సరికదా.. అతనితో అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ సందీప్‌ మాత్రం  వదల్లేదు.. అంజలిని వెంటాడాడు. అంతేకాదు... ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బటయపెడతానంటూ బెదిరించారు. దీంతో సందీప్‌ బెడద వదిలించుకోవాలని ప్రయత్నించింది అంజలి. సందీప్‌ విషయాన్ని... అతని దగ్గర ఉన్న ప్రైవేట్‌ ఫొటోల  గురించి ప్రియుడు బికాస్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ఎలాగైనా సందీప్‌ అడ్డు తొలగించుకోవాలని.. అతని దగ్గర ఉన్న ఫొటోలు తిరిగి తీసేసుకోవాలని ప్లాన్‌ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన తనను కలవాలని సందీప్‌కు ఫోన్‌ చేసింది అంజలి. హోటల్‌లో  ఒక రూమ్‌ కూడా బుక్‌ చేసింది. అదే హోటల్‌లో బికాష్‌ కూడా మరో గదిని బుక్‌ చేసుకున్నాడు. అంజలి, బికాశ్‌ అనుకున్నట్టే... సందీప్‌ హోటల్‌ గది వచ్చాడు. అంజలి-సందీప్‌ సన్నిహితంగా ఉన్న సమయంలో... బికాస్‌ వారి రూమ్‌లోకి వెళ్లాడు.  సందీప్‌ నుంచి ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సందీప్‌ తీవ్రంగా గాయపడి... అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన వికాస్, అంజలి సందీప్‌ దగ్గర ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి  పారిపోయారు. ఆ తర్వాత కాంబ్లీ మరణించాడని గౌహతి పోలీసులు చెప్తున్నారు. 


పోలీసులు కేసును ఎలా ఛేదించారు..?
హోటలు సిబ్బంది గది వైపు వెళ్లి చూడగా... సందీప్‌ కాంబ్లీ చనిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే కేసు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీ ఫుటేజీ, గెస్ట్ లిస్ట్, ఎయిర్‌పోర్టుకు వచ్చి వెళ్లే  ప్రయాణికుల జాబితాను పరిశీలించారు. నిందితులిద్దరి పేర్లు రిజిస్ట్రర్‌లో ఉండటంతో... వారి వివరాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు దగ్గరలోని ఓ హోటల్‌లో ఉన్న అంజలి, బికాశ్‌ను  అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకోవడం కాస్త ఆలస్యమైతే... రాత్రి 9:15కి వారిద్దరూ విమానంలో కోల్‌కతా వెళ్లిపోయేవారని పోలీసులు తెలిపారు.