Husband Cut His Wife Throat In Adilabad District: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే గొంతు కోసి హతమార్చి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేల (Bela) మండలంలో సయీద్పూర్ గ్రామానికి చెందిన యేసుల లక్ష్మణ్ (32), సునీత పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో భార్య సునీతతో గొడవపడిన భర్త లక్ష్మణ్.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. లక్ష్మణ్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే లక్ష్మణ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సునీత, లక్ష్మణ్ దంపతులకు 8, 7 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీత మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.