Actress Brother arrested in Drugs Case | హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సైబరాబాద్ పరిధిలో సోమవారం భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్.ఓ.టి, ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.


టాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో టాలీవుడ్‌కు, డ్రగ్స్ కు లింక్స్ అని హాట్ టాపిక్ అవుతోంది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వీరిలో సినీ ప్రముఖులకు సంబంధించిన వారితో పాటు పలువురు వ్యాపారవేత్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కానీ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ గమనిస్తే.. హీరోయిన్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరూ అరెస్ట్ అయినట్లుగా వెల్లడించలేదు. రాజేంద్రనగర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించానున్నారు. దాంతో డ్రగ్స్ కేసులో నిందితుల వివరాలపై క్లారిటీ రానుంది. 


నైజీరియన్లు ముంబై, గోవా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కొకైన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ పై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి వచ్చిందని, దాని వల్ల పెద్దలతో పాటు యువత, స్కూల్ విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా, పబ్ లలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే 8712671111 నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు. డ్రగ్స్ బారిన పడితే విద్యార్థులు, యువత జీవితాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 


tsnabho-hyd@tspolice.gov.in కు ఈమెయిల్ చేసి కూడా ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, డ్రగ్స్ ఉన్నాయని అనుమానిత వ్యక్తులు సమాచారం అందించాలని సూచించారు.


3.8 కిలోల గంజాయి సీజ్ 
జీహెచ్ఎంసీ పరిధిలో మరోచోట మత్తుపదార్థాలు సీజ్ చేశారు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒడిశాకు చెందిన యువకుడి నుంచి 3.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. SOT సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి తెచ్చిన నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశాకు చెందిన శుభకంత జెనా అనే యువకుడు ప్రీమియర్ ఇంజనీర్ కంపెనీలో సెక్యూరిటీ గా వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చాడని గుర్తించి, దుండిగల్ పోలీసులు, సైబరాబాద్ SOT పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు.