Nizamabad Crime Case: అతడో మానవ మృగం. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూతురిపైనా కన్నేశాడు. ఆరేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా ఆ పాపపై అత్యాచారం చేశాడు. చిన్నారి అంతర్గత అవయవాల్లో, ఒంటిపై తీవ్రగాయాలు చేశాడు. పాపం ఆ చిన్నారి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. అక్కడి నుండి పారిపోయాడు. ఆ చిన్నారి తల్లికి మాయమాటలు చెప్పి తనపై కేసు పెట్టకుండా చూసుకున్నాడు. కానీ నిజం ఎక్కువ రోజులు దాగి ఉండదు. వైద్యులు చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని గుర్తించి పోలీసులకు చెప్పగా.. వాళ్లు నిందితుడైన గోవింద్ రావును అరెస్టు చేశారు. 


తల్లితో సహజీవనం, ఆమె కూతురిపై అత్యాచారం 
కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు పనుల నిమిత్తం కొన్ని రోజుల కిందట నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి వచ్చి వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. అందులోని వివాహిత ఒంటరిగా ఉంటోంది. గోవింద్ రావుతో ఏర్పడిన పరిచయం కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఇద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆ మహిళకు అదివరకే ఓ పాప ఉంది. చిన్నారి వయస్సు ఆరేళ్లు. వివాహితతో సహజీవనం చేస్తూనే గోవింద్ రావు కన్ను ఆ పసి పాపపై పడింది. ఈ నెల 20 వ తేదీన ఆ మహిళ లేనప్పుడు.. ఆరేళ్ల పాప ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి అంతర్గత భాగాల్లో, ఒంటిపై తీవ్రంగా గాయలు చేశాడు. గోవింద్ రావు చేసిన లైంగిక దాడితో ఆ పాప సొమ్మసిల్లి పడిపోగా అదే అదనుగా గోవింద్ రావు అక్కడి నుండి పారిపోయాడు. కాసేపటి తర్వాత వచ్చిన తల్లి, తన కూతురుని అలా చూసి నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23వ తేదీన బాలిక ప్రాణాలు విడిచింది. 


ఆడుకుంటూ వెళ్లి పడిపోయిందని తల్లి ఫిర్యాదు


వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేస్తే తను చేసిన పని బయట పడుతుందని, తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించిన గోవింద్ రావు.. చిన్నారి తల్లిని ఏమార్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం చేస్తారని, సహజ మరణంగా చెప్పి బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి నుండి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే బాలిక పరిస్థితిని గమనించి వైద్యులు, తను చనిపోవడానికి కారణాలను అప్పటికే డిచ్ పల్లి పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందించారు. చిన్నారి మృతిపై ఆ తల్లి ఫిర్యాదు చేయకుండా గోవింద్ రావు అడ్డుకున్నాడు. గోవింద్ రావు మాయ మాటలు నమ్మిన ఆ మహిళ, తన కూతురు ఆడుకుంటూ వెళ్లి పడిపోయి చనిపోయిందని ఫిర్యాదు చేసేలా ప్రేరేపించాడు. గోవింద్ రావు చెప్పినట్లుగానే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇదే సెక్షన్ కింద తొలుత కేసు నమోదు చేసుకున్నారు. 


ఈ క్రమంలోనే పోలీసులు బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ కు తీసుకువచ్చారు. అయితే ఈ నెల 26వ తేదీన డిచ్ పల్లి పోలీసులకు పోస్టు మార్టం నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు తమదైన శైలిలో బాలిక తల్లిని, గోవింద్ రావును ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది.