Heart Breaking Incident In Annamayya District: 'అరే కన్నా.. ఎంతసేపు నిద్రపోతావ్.. త్వరగా లేవరా ఇంటికి వెళ్లిపోదాం. వినిపిస్తోందా.. లేరా బుజ్జీ. చూడు అందరూ ఎలా చూస్తున్నారో.. నువ్వు త్వరగా నిద్ర లేస్తే అంతా కలిసి ఇంటికి వెళ్లిపోదాం.' ఇది ఓ మాతృమూర్తి తన బిడ్డతో అంటున్న మాటలు. ఆస్పత్రి బెడ్‌పై కుమారుని పక్కన పడుకుని ఆ బాబు నిద్రపోతున్నాడని ఆ తల్లి జోకొడుతోంది. అయితే, ఆ మాతృ హృదయం అంగీకరించలేకపోతోంది.. ఆ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయాడని. రోడ్డు ప్రమాదం తన బిడ్డను తనకు శాశ్వతంగా దూరం చేసిందని. ఆ కన్న పేగు భరించలేకపోతోంది.. తన బిడ్డ తనను మళ్లీ అమ్మా అని పిలవడని, ఆ అవకాశమే లేదని. కొడుకు చనిపోయాడన్నది నిజం.. తన బిడ్డ తిరిగొస్తాడనే భ్రమతో ఓ వైపు కంట నీరు పెడుతూనే, మరోవైపు కుమారుని మృతదేహం పక్కనే కూర్చుని బిడ్డతో సంభాషించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన అక్కడి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబురామ్, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. చిన్నోడు (3) ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పిల్లలిద్దరితో కలిసి బైక్‌పై సోమవారం రాజంపేటలోని (Rajampeta) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బైక్ అదుపు తప్పి అంతా కింద పడిపోయారు. దీంతో ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్ (5) ఎగిరి రోడ్డుపై పడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో శ్యామ్ మృతదేహాన్ని సిబ్బంది బెడ్‌పై ఉంచగా.. తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని.. 'కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు.. నిద్దలే' అంటూ ఓ భ్రమలో ఉండిపోయారు. భర్త ఆమెను సముదాయించేందుకు యత్నించినా బాలు నిద్ర లేచాకే ఇంటికి వెళ్దామని చెప్పడంతో అంతా కన్నీటితో విలపిస్తూ అలాగే ఉండిపోయారు.
Also Read: Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం