కాకినాడ రూరల్ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. 5, 6వ తరగతి చదువుతున్న వీరు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే వీరందరినీ వలసపాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అసలు వీళ్లంతా ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. పాఠశాల సిబ్బంది సమాచారంతో పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమైందో తెలుసుకునే పనిలో పోలీసులు పడగా... తమ పిల్లలకు ఏమైందో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని... రక్త నమూనాలను వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 


ఘటనపై ఆరా తీసిన మంత్రి బొత్స..


కాకినాడ వలసపాకలోని కేంద్రీయ విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రికి ఫోన్ చేశారు. అసలేమైందో కనుక్కోవాలని.. పిల్లలందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామన్నారు. అనంతర కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.


కర్నూలులో 22 మంది విద్యార్థులకు అస్వస్థత..


కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల  గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో నెల రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు..


రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల  గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


చిక్కీలో పురుగులు..


పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్‌పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు.