Three Died In Road Accident: వారంతా పొట్ట కూటి కోసం కూలీ పనులు చేసుకునేవారు. రోజంతా పని చేస్తే తప్ప వారి జీవనం సాగదు. వారికి వారాలతో పనిలేదు. పని చేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. ఆదివారం కూడా రోజు లాగే  కూలీ పనులకు వెళ్లారు. రోడ్డు విస్తరణ పనుల్లో నిమగ్నమయ్యారు. లారీ రూపంలో మృత్యువు వారిని కబలించింది. పనులు చేస్తుండంగా టిప్పర్ ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. రహదారిపై పనులు చేస్తుండగా వేగంగా వెళ్తున్న లారీ అక్కడే ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో టిప్పర్ పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 


ఈ హృదయ విదారక ఘటన నిర్మల్​ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. రహదారి పనులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. నిర్మల్​ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద 44వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తన రోజువారీ కూలీలు పని చేస్తున్నారు. 


పనుల్లో భాగంగా రోడ్డు పక్కన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉత్తరప్రదేశ్​ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ (AP 39T 9567) వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. దీంతో టిప్పర్ రహదారిపై పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్​ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని పోలీసులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్లీనర్​ మృతి చెందాడు. 


ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కూలీలు బోథ్ మండలం చించోలి గ్రామానికి చెందిన ప్రసాద్, నేరడిగొండ మండలం బందం గ్రామానికి చెందిన లాల్ సింగ్‌, అలాగే లారీ క్లీనర్‌ ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన షేక్‌ ఖాసింగా గుర్తించారు. ఘటనతో బూరుగుపల్లి వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు.