Rajasthan Crime:
ఇటుక బట్టీలో మృతదేహం..
రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజకీయంగానూ కాక రేపింది. మరి కొద్ది నెలల్లోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బిల్వారాలోని ఓ ఇటుక బట్టీలో కాలిపోయిన మృతదేహం కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. కూతురి జాడ కోసం తల్లి అంతా వెతికింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు. చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో శవమై కనిపించింది. ఆమె ఎముకలు, పట్టీలు, షూస్ ఘటనా స్థలంలో దొరికాయి. అప్పటికే ఆమె శరీరం అప్పటికే మంటల్లో కాలిపోయింది. హత్య చేసే ముందు సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోనే దాక్కున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతదేహం కనిపించగానే వందలాది మంది గ్రామస్థులు వచ్చి ఆందోళన చేశారు. న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. కూతురు కనిపించడం లేదని ముందుగానే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
బీజేపీ విమర్శలు..
కేవలం ఆమె ఐడీకార్డ్, బర్త్ సర్టిఫికేట్ అడిగి వదిలేశారని మండి పడుతున్నారు. కొందరు బీజేపీ మంత్రులు గ్రామస్థులతో పాటు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ఈ విషయంలో గహ్లోట్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతకు ముందు జులై 14న ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరవాత జోధ్‌పూర్‌లోని ఓ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. జులై 19న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేసి కాల్చేశారు. వీటిని హైలైట్ చేస్తూ బీజేపీ పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. సీఎం గహ్లోట్ ఎదురు దాడికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. అసోం, ఢిల్లీ, హరియాణా క్రైమ్‌రేట్‌లో టాప్‌లో ఉన్నాయని అన్నారు. ఈ కేసుని విచారించేందుకు రాజస్థాన్ బీజేపీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.