Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన యాప్‌లోని "10 నిమిషాల్లోనే డెలివరీ" సేవను నిలిపివేసింది. దీనిని జొమాటో ఇన్‌స్టంట్ ‍‌(Zomato Instant) అని పిలుస్తారు. ఈ 10 మినిట్స్‌ సర్వీసును విస్తరించడంలో, ప్రజాదరణ పొందడంలో కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అసలే కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, అనవసర భారం ఎందుకున్న భావనతో ఆ సర్వీసును ఆపేస్తూ జొమాటో నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్‌ భాగస్వాములకు కూడా ఈ విషయం గురించి ఈ కంపెనీ ఇటీవల సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 


ఆర్డర్‌ చేసిన '10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ' చేస్తామంటూ.. గత సంవత్సరం ‍‌(2022) మార్చి నెలలో గురుగ్రామ్‌లో ఈ సర్వీసును పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జొమాటో ప్రారంభించింది. ఆ తర్వాత బెంగళూరుకు విస్తరించింది.


కనీస ఆర్డర్లు కూడా రావడం లేదు
వాస్తవానికి, '10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ' సేవలో కొన్ని ప్రాంతాల్లో బాగానే కంపెనీ విజయం సాధించింది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం వృద్ధి ఆశించిన విధంగా లేదు. మెనూని విస్తరించడంలో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎక్కువ ప్రాంతాల్లో '10 నిమిషాల డెలివరీ'కి తగినన్ని ఆర్డర్‌లను పొందలేకపోయింది. 


మార్కెట్‌లో పెరిగిన పోటీని తట్టుకుని, లాభాల్లోకి మారేందుకు ఇన్‌స్టంట్ సేవను జొమాటో ప్రారంభించింది. కనీస ఆర్డర్లు కూడా రాకపోవడంతో... లాభాల సంగతి అటు ఉంచి, స్థిర వ్యయాలకు సరిపోయే మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోయింది. స్థిర వ్యయాలను భర్తీ చేయగల మినిమమ్‌ ఆర్డర్లు రాకపోవడమే దీనికి కారణం. 


కొత్త సర్వీసును ప్రారంభించే అవకాశం
Zomato Instant సేవను నిలిపివేసిన కంపెనీ, అతి త్వరలోనే కొత్త సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు కంపెనీ దృష్టి థాలి లేదా కాంబో మీల్స్‌ సహా 'తక్కువ విలువున్న ప్యాక్డ్ మీల్స్‌'పై ఉంది. కొత్త సేవను 7 నుంచి 10 రోజుల్లో ప్రారంభించవచ్చు. 


జాతీయ మీడియా నివేదిక ప్రకారం... Zomato 10 నిమిషాల డెలివరీని ఆపట్లేదు, రీబ్రాండ్ చేస్తోంది. Zomato చెబుతున్న ప్రకారం ప్రకారం కూడా ఇన్‌స్టంట్ సర్వీస్‌ను నిలిపివేట్లేదు. రెస్టారెంట్‌ భాగస్వాములతో కలిసి కొత్త మెనూపై పని చేస్తోంది. 


2022 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ. 251 కోట్లకు జొమాటో తగ్గించగలిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ. 429.6 కోట్లతో పోలిస్తే ఈ కంపెనీ నష్టాల నుంచి చాలా గట్టిగా కోలుకుంది. సంస్థ ఆదాయం 62.2 శాతం పెరిగి రూ. 1,661 కోట్లకు చేరుకుంది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 1,024 కోట్లుగా ఉంది.


జొమాటో షేర్‌ గత 6 నెలల కాలంలో 7% లాభపడితే, గత ఏడాది కాలంలో 44% నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.