Zomato Swiggy: గురుగావ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం చేస్తున్న జొమాటో, బెంగళూరుకు చెందిన ప్రత్యర్థి కంపెనీ స్విగ్గీ కంటే ఒకడుగు ముందే ఉంటోంది. ఈ ఏడాది జనవరి - జూన్ కాలంలో, స్విగ్గీ నుంచి మార్కెట్ వాటాను జొమాటో చేజిక్కించుకుంది. స్విగ్గీ ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నా, జొమాటో ముందు దాని పప్పులు ఉడకడం లేదు. బ్రోకింగ్ హౌస్ జెఫరీస్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.
జొమాటోకు 55% మార్కెట్ వాటా
ఈ ఏడాది జనవరి - జూన్ కాలంలో, ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో సగటున 55 శాతం మార్కెట్ వాటాతో కాలర్ ఎగరేసింది. స్విగ్గీ గ్రాస్ మర్చండైస్ వాల్యూ (GMV) $1.3 బిలియన్లతో పోల్చితే, $1.6 బిలియన్ల విలువను Zomato సాధించింది.
2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఆర్డర్లు 38 శాతం, GMV 40 శాతం వృద్ధి చెందాయి.
భారీగా తగ్గిన జొమాటో నష్టాలు
2022 జనవరి - జూన్ కాలంలో, స్విగ్గీ $315 మిలియన్లకు పైగా నష్టపోయినట్లు జెఫరీస్ వెల్లడించింది. ఇదే సమయంలో, స్వతంత్ర ప్రాతిపదికన జొమాటో నష్టం $50 మిలియన్లు. దీని క్విక్ కామర్స్ యూనిట్ బ్లింకిట్ (Blinkit) నష్టాలను కూడా కలిపితే, ఏకీకృత ప్రాతిపదికన వచ్చిన నష్టం దాదాపు $170 మిలియన్లు.
2022 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలోనూ, ఏకీకృత ప్రాతిపదికన కేవలం $25 మిలియన్ల కంటే తక్కువ నష్టంతో, తమ పనితీరును జొమాటో మరింత మెరుగుపరుచుకుంది. ఆ త్రైమాసికంలో, నష్టాలను దాదాపు సగానికి తగ్గించి రూ. 250.8 కోట్లకు దించింది. 2021 ఏడాది ఇదే కాలంలో నష్టం రూ. 434.9 కోట్లుగా ఉంది. ఈ మూడు నెలల కాలంలో, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గత సంవత్సరం కంటే 62% పెరిగి రూ. 1,661.3 కోట్లకు చేరుకుంది.
డిస్కౌంట్ల వల్లే నష్టం
జొమాటోతో పోలిస్తే స్విగ్గీ ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ల వల్లే జొమాటో కంటే ఎక్కువ నష్టాలను స్విగ్గీ భరించాల్సి వస్తోందని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది.
రెండు కంపెనీల క్విక్ కామర్స్ బిజినెస్‌లు కూడా బాగా పుంజుకున్నాయి. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ (Instamart ) వ్యాపారం ఏటా 15 రెట్లు వృద్ధి చెందుతోంది. $257 మిలియన్ల GMV సాధించిందని జెఫరీస్ వెల్లడించింది. జొమాటో యాజమాన్యంలోని Blinkit GMV $270 మిలియన్లుగా ఉంది.
భవిష్యత్‌లో నష్టాలను తగ్గించుకోవాలంటే ఫుడ్ డెలివరీ డిస్కౌంట్లలో దూకుడును స్విగ్గీ తగ్గించుకోవాల్సి ఉంటుందని జెఫరీస్ సూచించింది. లేకపోతే, జొమాటో దూకుడు పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. స్విగ్గీ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ Swiggy One తరహాలోనే జొమాటో కూడా ఏదోక మార్గంలో మళ్లీ ప్రో మెంబర్‌షిప్‌ను స్టార్ట్ చేయవచ్చని తెలిపింది.
జొమాటో ఇటీవలే దాని ప్రో, ప్రో ప్లస్ మెంబర్‌షిప్ స్కీమ్స్‌ను నిలిపివేసింది. ఫుడ్ డెలివరీ కోసం కొత్త “లాయల్టీ ప్రోగ్రాం” తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు.
గత నెల రోజుల కాలంలో జొమాటో షేర్లు దాదాపు 2 శాతం నష్టపోయాయి. గత ఆరు నెలల కాలంలో దాదాపు 2 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 55 శాతం నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.