వేద కోర్టుకి బయల్దేరుతుంటే మాలిని దేవుడికి పూజ చేసి హారతి తీసుకోమని ఇస్తుంది. ‘ఏ ఆడదానికి రాకూడదని సమస్య నాకొచ్చింది. భర్త మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దుర్మార్గంతో కావాలని ఈ నేరం చేయడం ఒకటి అయితే మోసం, కుట్రతో ఆ నేరం నుంచి తప్పించుకోవాలని అనుకోవడం అంతకంటే పెద్ద నేరం. చావు దాటి వచ్చిన మా అమ్మకి న్యాయం చెయ్యాలి. అందుకు మీ సపోర్ట్ ‘ అని వేద అడుగుతుంది. మా ఇద్దరి సపోర్ట్ నీకే వేద అని మాలిని అంటుంటే యష్ వస్తాడు. తన లైఫ్ లో చాలా కీలకమైనదని, ఈ కోర్టు కేసులో తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉందని ఆశీర్వదించమని అడుగుతాడు.
‘బిడ్డగా యష్ నీ ఆశీర్వాదం అడగటం నువ్వు దీవించడంలో తప్పు లేదు, ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇద్దరిలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. ఇద్దరికీ నీ బ్లెసింగ్స్ అవసరమే దీవించు’ అని రత్నం చెప్తాడు. భార్య, భర్తకి ఇద్దరికీ వేర్వేరుగా దీవెన ఉండదు మీరిద్దరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదించమని వేద అడుగుతుంది. ధర్మం గెలవాలని రత్నం దీవిస్తాడు. యష్ బయటకి రాగానే సులోచన ఎదురుపడుతుంది. తనని చూసి యష్ మనసులోనే బాధపడతాడు. మీ తరపున పోరాటం చేస్తాను అని చెప్పి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలిసిన రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని యష్ మనసులో అనుకుంటాడు. తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.
అభిమన్యు మాళవిక చేసిన పని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఖైలాష్ వచ్చి మరింత మంట పెడతాడు. యశోధర్ గాడి పెళ్ళాంగా ఉన్నప్పుడు వాడు నచ్చలేదు మీ దగ్గరకి వచ్చింది. ఇప్పుడు మీరు నచ్చలేదని యశోధర్ గాడి దగ్గరకి వెళ్ళిపోయింది, ఇదేమి బాగోలేదని నిప్పు వేస్తాడు. నన్ను నమ్మకుండా ఆ యశోధర్ ని నమ్ముతావా చాలా పెద్ద తప్పు చేశావ్ ఈరోజు యశోధర్ కేసు ఒడిపోతాడు, నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే చిప్ప కూడు తినాల్సిందే అని అభి అంటాడు. యష్ తన కారులోనే వేద వాళ్ళని కోర్టుకి తీసుకుని వెళ్తాడు. వేద, యష్ మూడ్ మార్చడం కోసం సులోచన కావాలనే మాలినిని పలకరిస్తుంది. కానీ మాలిని మాత్రం కస్సుమని అంటుంది. ఆర్ కొడుతుందని చిత్ర పాటలు పెట్టమని అడుగుతుంది.
వేద, యష్ వాళ్ళకి తగ్గట్టుగానే 'ఎన్నెన్నో జన్మలబంధం..' అంటూ సాంగ్ వస్తుంది. అందరూ కోర్టు దగ్గరకి చేరుకుంటారు. ఆల్ ది బెస్ట్ చెప్పమని వేద యష్ ని అడుగుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పిన యష్ నువ్వు గెలుస్తావో నన్ను గెలిపిస్తావో అని అంటాడు. కోర్టులో ఏం జరిగిన అది మన ఇద్దరి మధ్య దూరం పెరగకూడదు అని వేద అంటుంది. మన మధ్య గొడవలు ఉన్నాయంటే ఖుషి తట్టుకోలేదు తన కోసం అడుగుతున్నా మాట ఇవ్వమని వేద అడుగుతుంది. మన మధ్య ఎప్పటికీ దూరం పెరగదు, మనమధ్య మూడో మనిషికి చోటు ఉండదు అని యష్ మాట ఇస్తూ ప్రామిస్ చేస్తుంటే మాళవిక వచ్చి పిలుస్తుంది.
తరువాయి భాగంలో..
మాళవిక వేదని కావాలని రెచ్చగొడుతుంది. నా ఖుషి కోసం వచ్చాను గెలిచాను, ఇప్పుడు కూడా గెలుస్తాను. ఆరోజు నువ్వు గెలవడానికి యశోధర్ నీవైపు ఉన్నాడు, కానీ ఇప్పుడు యశోధర్ నావైపు ఉన్నాడని మాళవిక ధైర్యంగా చెప్తుంది.