Zomato CEO : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తమ డెలివరీ ఏజెంట్లు ప్రతి నెలా సగటున ఎంత సంపాదిస్తారో స్వయంగా వెల్లడించారు. కంపెనీ 2024లో 15 లక్షలకు పైగా డెలివరీ పార్ట్ నర్స్ కు సంపాదనా అవకాశాలను అందించిందని దీపిందర్ గోయల్ ఎక్స్ పోస్ట్‌లో పంచుకున్నారు. రూ.5వేల పెట్రోల్ ఖర్చును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, రోజుకు కనీసం 8గంటలు పని చేసే డెలివరీ ఏజెంట్లు నెలకు సగటున సుమారు రూ. 28,000 సంపాదిస్తున్నారన్నారు. ఈ పెరుగుదల రోజురోజుకూ పెరుగుతోన్న డిమాండ్ ను, అలాగే గిగ్ వర్క్ పట్ల కంపెనీ విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. జీతంతో పాటు ప్రమాదం, ఆరోగ్యం, మరణ సంబంధిత ఖర్చులను సైతం కవర్ చేసే బీమా ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోందని గోయల్ తెలిపారు.
2008లో FoodieBay అనే పేరుతో ప్రారంభమైన జొమాటో, తన డెలివరీ పార్టనర్స్‌కు ఏడాది పొడవునా సంపాదించడానికి, ఎప్పుడైనా లాగిన్ అవ్వడానికి వెసులుబాటు అందించిందని గోయల్ చెప్పారు. నగరాల్లో ఇప్పుడు అనేక మంది డెలివరీ ఏజెంట్స్ పార్ట్-టైమ్ జాబ్ చేసి కూడా సంపాదించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటున్నారని, మరికొందరు వారి కాలానుగుణంగా లేదా రోజులోని నిర్దిష్ట గంటలలో పని చేస్తూ సంపాదిస్తున్నారన్నారు. "మా నెట్‌వర్క్ పెరుగుతూనే ఉన్నందున, మా ఏజెంట్ ల జీవనోపాధిపై చూపుతున్న సానుకూల ప్రభావం పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాము. వారి శ్రేయస్సు పట్ల మా నిబద్ధత అచంచలమైనది. మేం వారికి ప్రతి అడుగులోనూ ప్రాధాన్యతనిస్తూనే ఉంటాం" అని దీపిందర్ గోయల్ ఎక్స్ లో తన పోస్ట్‌లో నొక్కిచెప్పారు.
జొమాటో డెలివరీ ఏజెంట్ బీమా
కంపెనీలో చేరిన అన్ని డెలివరీ ఏజెంట్లు డిఫాల్ట్‌గా డెలివరీ పార్టనర్ బీమా పాలసీ పరిధిలోకి వస్తారని గోయల్ పంచుకున్నారు. ఇందులో ప్రమాదం, మరణం, హెల్త్ కవరేజ్ లాంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. "ఏజెంట్లకు చెల్లించే క్లెయిమ్‌లు ఏటా రూ. 53 కోట్లు దాటుతున్నాయి. 2024 క్లెయిమ్‌లలో 55 శాతం ప్రమాదేతర వైద్య ఖర్చులను కవర్ చేస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
గిగ్ కార్మికుల శ్రేయస్సుకు పెరుగుతోన్న ప్రాధాన్యత
ఇటీవల పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి బడ్జెట్ 2025లో గిగ్ కార్మికులకు సైతం మద్దతు ప్రకటించారు. సుమారు కోటి మంది గిగ్ కార్మికులకు అధికారిక గుర్తింపు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఇందులో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడంతో పాటు ఇ-శ్రమ్ పోర్టల్ లో కార్మికులను నమోదు చేయడం, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన కింద ఆరోగ్య సంరక్షణ కవరేజీ అందించడం వంటివి ఉన్నాయి. ఇవన్నీ గిగ్ కార్మికుల శ్రేయస్సును మరింత శక్తివంతం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జొమాటో గిగ్ వర్కర్లు ఎలా సంపాదిస్తారు?
జొమాటోతో అనుబంధంగా పనిచేసే గిగ్ వర్కర్లు ప్రతి డెలివరీకి సంపాదించే మోడల్‌లో పని చేస్తూ ఉంటారు. అంటే వారు డెలివరీల సంఖ్య ఆధారంగా సంపాదిస్తారు. వారి ఆదాయాలు వారానికోసారి వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతాయి. దీన్ని జొమాటో డెలివరీ పార్టనర్ యాప్‌లోని చెల్లింపుల విభాగం కింద ట్రాక్ చేయవచ్చు.
గిగ్ వర్కర్లు అంటే ఎవరు?
పే ఫర్ వర్క్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇలాంటి ఉద్యోగులు కంపెనీలతో అనుబంధం కలిగి ఉంటారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో స్వతంత్రంగా పనిచేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఉద్యోగులు, కాల్ ఆన్ వర్క్స్ అందుబాటులో ఉన్న ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, లాజిస్టిక్స్, ఆన్‌లైన్ సేవల్లో లక్షలాది మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వారి ఉపాధి తాత్కాలికమే తప్ప కంపెనీలు ఎలాంటి అదనపు భద్రత, ప్రయోజనాలు ఇవ్వవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే గిగ్ ఎకానమీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : 8th Pay Commission Salaries: ప్యూన్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు - ఏ ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది?