Blinkit-Zomato New Ambulance Service In 10 Minutes: ప్రజల అవసరాలకు తగ్గట్లుగా క్విక్ కామర్స్ (Quick Commerce) రంగం రూపరేఖలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు, క్విస్ కామర్స్ కంపెనీలు కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికి కిరాణా సామాగ్రి లేదా కూరగాయలు లేదా మరికొన్ని చిన్నపాటి వస్తువులు డెలివరీ చేసేవి. ఇప్పుడు, ప్రజలకు అత్యంత కీలకమైన & ప్రాణాలను కాపాడే సర్వీస్ కూడా క్విక్ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో యాడ్ అయింది.
ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే, కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. జొమాటో (Zomato)కు చెందిన శీఘ్ర వాణిజ్య సంస్థ (క్విక్ కామర్స్ కంపెనీ) బ్లింకిట్.. 10 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. మొదట, సైబర్ సిటీ గురుగావ్ నుంచి ఈ సేవను ప్రారంభించింది.
10 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్ ఎలా పొందాలి?
బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో దీని గురించి వివరించారు. గురుగావ్‌లో తక్షణం & విశ్వసనీయమైన అంబులెన్స్ సేవలను అందించేందుకు తాము మొదటి అడుగు వేయబోతున్నట్లు వెల్లడించారు. మొదటి ఐదు అంబులెన్సులు గురుగావ్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. బ్లింకిట్ యాప్‌లో 'బేసిక్ లైఫ్ సపోర్ట్' (BLS) అంబులెన్స్ ఆప్షన్ ద్వారా అంబులెన్స్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలు
బ్లింకిట్ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్, AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అవసరమైన అత్యవసర మందులు & ఇంజెక్షన్‌లు సహా అవసరమైన ప్రాణాలను రక్షించే పరికరాలు ఉంటాయని అల్బిందర్ ధిండా వెల్లడించారు. ప్రతి అంబులెన్స్‌లో పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్ ఉంటారు. అత్యవసర సమయంలో అధిక నాణ్యత గల వైద్య సేవను తాము అందించగలమని అల్బిందర్ ధిండా తెలిపారు.
ఇతర నగరాలకు సేవల విస్తరణ
బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్ లక్ష్యం లాభార్జన కాదని అల్బిందర్ ధిండా X పోస్ట్‌లోవెల్లడించారు. ఈ సేవను వినియోగదారులకు చాలా తక్కువ ధరతో అందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు కిట్ అంబులెన్స్ సర్వీస్‌ను విస్తరించే లక్ష్యంతో పని చేస్తామని తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇచ్చి, ప్రాణాలు కాపాడే వ్యక్తిగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా రూ.8,700 పెరిగిన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ