Richest States In India In 2024: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విజయవంతమైన సంవత్సరంగా 2024 నిలిచింది. ఈ సంవత్సరం, భారతదేశం 8.2% GDP వృద్ధిని నమోదు చేసింది, ఇది ప్రభుత్వం అంచనా వేసిన 7.3% వృద్ధి రేటు కంటే ఎక్కువ. రూపాయల్లో చూసుకుంటే, భారత జీడీపీ రూ. 47.24 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ పనితీరు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.


దేశంలో ధనిక రాష్ట్రాలు


28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక జాతీయ రాజధాని ప్రాంతాన్ని (NCR) కలిగిన భారతదేశ వైవిధ్యమే ఆర్థిక బలంగా మారింది. వీటిలో కొన్ని రాష్ట్రాలు ప్రాంతీయంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా నిలిచాయి. GDP, GSDP ఆధారంగా, ఈ సంవత్సరం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక టాప్‌-3 ధనిక రాష్ట్రాలుగా ఉన్నాయి.


మహారాష్ట్ర నంబర్‌ 1 సంపన్న రాష్ట్రం
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కేంద్రంగా చేసుకున్న మహారాష్ట్ర, 2024లో అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది. అంచనాల ప్రకారం, మహారాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) రూ. 42.67 లక్షల కోట్లు, ఇది జాతీయ GDPలో 13.3%. మహారాష్ట్ర సంపదలో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, పరిశ్రమలు, చలనచిత్ర పరిశ్రమ నుంచి వస్తుంది. ఈ రాష్ట్ర రాజధాని ముంబై, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) వంటి ఆర్థిక సంస్థలకు నిలయం. దేశంలోనే అతి పెద్ద కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries), టాటా (Tata), సహా మరికొన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబైలోనే ఉన్నాయి.


రెండో స్థానంలో తమిళనాడు
'డెట్రాయిట్ ఆఫ్ ఆసియా'గా పేరొందిన తమిళనాడు, రూ. 31.55 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో రెండో స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి పరిశ్రమలు దీని ఆర్థిక శక్తిలో ప్రధాన భాగం. తమిళనాడు తలసరి GDP రూ. 3.50 లక్షలు (FY 2023-24 ప్రకారం). తలసరి ఆదాయం పరంగా కూడా ఇది బలమైన రాష్ట్రం.


మూడో స్థానంలో కర్ణాటక
28.09 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో కర్ణాటక థర్డ్‌ ప్లేస్‌లో ఉంది. ఈ రాష్ట్రం, నేషనల్‌ GDPకి 8.2% తోడ్పడుతోంది. "సిలికాన్ వ్యాలీ" బెంగళూరు ఈ రాష్ట్ర ఆర్థిక శక్తికి ప్రధాన వనరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌లలో ఈ రాష్ట్రం ముందంజలో ఉంది.


నాలుగో స్థానంలో గుజరాత్
27.9 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో గుజరాత్ ఫోర్త్‌ ర్యాంక్‌ సాధించింది. ఇది జాతీయ GDPకి 8.1% అందిస్తోంది. బలమైన పారిశ్రామిక, వ్యాపార పునాదులు ఉన్న రాష్ట్రం గుజరాత్‌. పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్, డైమండ్ పాలిషింగ్ వంటి రంగాలలో అగ్రగామిగా ఉంది.


ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఇది. రూ. 24.99 లక్షల కోట్ల GSDPతో జాతీయ GDPకి 8.4% కాంట్రిబ్యూషన్‌తో, సంపన్న రాష్ట్రాల లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. అయితే, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.0.96 లక్షలు మాత్రమే, ఇది ఇతర అగ్ర రాష్ట్రాల కంటే చాలా తక్కువ.


సంపన్న రాష్ట్రాల జాబితాలో మరికొన్ని రాష్ట్రాలు


పశ్చిమ బెంగాల్: రూ. 18.8 లక్షల కోట్ల GSDP & 5.6% జాతీయ సహకారంతో ఆరో స్థానంలో ఉంది.


తెలంగాణ: రూ. 16.5 లక్షల కోట్ల GSDP & 4.9% సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇది. ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది.


ఆంధ్రప్రదేశ్: రూ. 15.89 లక్షల కోట్ల GSDP & 4.7% సహకారంతో 8వ స్థానంలో ఉంది.


దిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రూ. 11.07 లక్షల కోట్ల జీఎస్‌డీపీ నమోదైంది. ఇది జాతీయ GDPకి 3.6% తోడ్పడుతోంది.


S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి $7 ట్రిలియన్‌లను అధిగమించవచ్చు.


మరో ఆసక్తికర కథనం: