Year Ender 2022: 2022లో... కరోనా థర్డ్ వేవ్, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, చమురు రేట్లు, వడ్డీ రేట్ల పెంపు వంటివి భారతీయ స్టాక్స్ మార్కెట్ల మీద చూపినా, దేశంలో వినియోగ ధోరణి (consumption trend) మీద ఇన్వెస్టర్ల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. FMCG (Fast moving consumer goods) స్టాక్స్ పనితీరులో ఇది ప్రతిబింబించింది.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మీద ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా వృద్ధి తగ్గడం, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా లాభదాయకత మీద ఒత్తిడి పడినా... చాలా FMCG మేజర్స్ ఈ తుపానును ఎదుర్కొని అమ్మకాలు, లాభాల్లో వృద్ధిని సాధించాయి.
బెస్ట్ పెర్ఫార్మర్లలో ఒకటి
2022లో, 22% పైగా లాభాలతో నిఫ్టీ FMCG ఇండెక్స్ (Nifty FMCG Index) 4వ అత్యుత్తమ సెక్టోరల్ ఇండెక్స్‌గా నిలిచింది, ఈ ప్యాక్‌లోని స్టాక్స్ కూడా మద్దతు ఇచ్చింది. అంతేకాదు, 2017 తర్వాత (ఐదేళ్ల తర్వాత) ఇండెక్స్ ఇచ్చిన అత్యుత్తమ రాబడి ఇది.
ఈ నెల ప్రారంభంలో నిఫ్టీ FMCG ఇండెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయి 46,331.20 పాయింట్లకు చేరుకుంది.
2022లో టాప్-3 FMCG స్టాక్స్
ఇండెక్స్‌లో కనిపించిన అత్యుత్తమ పనితీరుకు ప్రధాన కారణం ITC స్టాక్. 2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (YTD) ఈ స్టాక్ 56% రాబడిని ఇచ్చింది, గత దశాబ్దం కాలంలో ఇదే రికార్డ్ స్థాయి లాభం. హోటల్స్ వ్యాపారంలో చేసిన మార్పులు, నష్టాలను తెచ్చి పెట్టే కొన్ని వ్యాపారాలను మూసేయడం, కొన్ని కొత్త ప్లాన్‌లను వాయిదా వేయడం వల్ల ITC మూలధన కేటాయింపులో (Capex) గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఆ ఫలాలు పెట్టుబడిదారులకు కూడా అందాయి.
FMCG ప్యాక్‌లో రెండో హీరో బ్రిటానియా ఇండస్ట్రీస్ (Britannia Industries). ఈ స్టాక్ 2022లో ఇప్పటి వరకు 25% రాబడిని అందించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. వాల్యూమ్ పెరుగుదల, లాభదాయకతకు సంబంధించి సవాళ్లు ఎదురైనప్పటికీ, ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో తన పరిధిని బ్రిటానియా పెంచుకోగలిగింది. దీంతో, FMCG పరిశ్రమలో దాని మొత్తం మార్కెట్ వాటా సెప్టెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
FMCG ప్యాక్‌లో మూడో బెస్ట్ నేమ్ హిందుస్థాన్ యునిలీవర్ (Hindustan Unilever). ఈ స్టాక్ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 15% పైగా రాబడిని ఇచ్చింది, చాలా బ్రోకరేజ్‌ల అగ్ర ఎంపికగా నిలిచింది.
FMCG రంగానికి 2023 ఎలా ఉంటుంది?
భారతదేశ వినియోగం బాగానే ఉంది కాబట్టి, చాలామంది ఎక్స్‌పర్ట్‌లు ఈ రంగం మీద సానుకూలంగా ఉన్నారు. గ్రామీణ వినియోగంలో రికవరీ, ద్రవ్యోల్బణంలో తగ్గుదల, బలమైన దేశీయ వృద్ధి నేపథ్యంలో ఈ రంగానికి 2023 బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.