Recession - Inflation:


ఆర్థిక మాంద్యం చీకట్లలోకి జారుకుంటున్న ప్రపంచానికి భారత్ మళ్లీ ఆశాదీపంగా మారింది. 2022లో గ్లోబల్‌ సెంటిమెంటును కాదని మెరుగైన వృద్ధిరేటు సాధించింది. అమెరికా, ఐరోపా, చైనా, జపాన్‌ వంటి దేశాలు అల్లాడుతుంటే మన దేశం వృద్ధి పథంలో దూసుకెళ్లింది. స్టాక్‌ మార్కెట్‌ నుంచి జీఎస్టీ వసూళ్ల దాకా రికార్డులు సృష్టించింది.


స్టాక్‌ మార్కెట్ల రైడ్‌


ద్రవ్యోల్బణం పెరుగుదల, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా అడ్డంకులతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్‌ వంటి సూచీలు ఏకంగా 30-40 శాతం మేర పతనమయ్యాయి. టెక్నాలజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఇందుకు భిన్నంగా భారత ఈక్విటీ మార్కెట్లు దుమ్మురేపాయి. 10 శాతం కన్నా తక్కువే పతనమైన సెన్సెక్స్‌, నిఫ్టీ సెప్టెంబర్లో ఫామ్‌లోకి వచ్చాయి. సెన్సెక్స్‌ 61 వేలు, నిఫ్టీ 19వేల మార్కును తాకి రికార్డులు సృష్టించాయి.


డాలర్‌తో తగ్గినా మిగతా వాటితో బలంగానే


అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే ఆసియా సహా అనేక దేశాల కరెన్సీలు దారుణంగా పడిపోయాయి. ఐరోపా యూరో, బ్రిటన్‌ పౌండు, జపాన్‌ యెన్‌ విలువ కోల్పోయాయి. భారత రూపాయి సైతం ఈ సునామీ తాకిడికి గురైంది. రూ.82 స్థాయికి చేరుకొని ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది. అయితే మిగతా దేశాల కరెన్సీతో పోలిస్తే అత్యంత పటిష్ఠంగా నిలబడింది రూపాయి మాత్రమే.


రెపోరేట్ల పెంపు


ద్రవ్యోల్బణం వల్ల అమెరికా ఫెడ్‌ నుంచి ఆర్బీఐ వరకు వడ్డీరేట్లు పెంచుతూ వెళ్లాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆర్బీఐ 250 బేసిస్‌ పాయింట్ల మేర విధాన రేట్లను పెంచాయి. ఫలితంగా ఈఎంఐల భారం పెరిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 2023లో వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చని లేదా తక్కువ పెంచొచ్చని అంచనాలు ఉన్నాయి.


జీఎస్‌టీ రికార్డులు


కరోనా సమయంలో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టాయి. వరుసగా 10 నెలలు ప్రతి నెలా రూ.1.40 లక్షలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. దసరా, దీపావళి సీజన్లో ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి వసూళ్లు చేరాయి.


హైరింగ్‌ సెంటిమెంటు


ప్రస్తుతం టెక్‌ కంపెనీల టైమ్‌ బాగాలేదు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలే ఆదాయం తగ్గడంతో వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లోనూ ఇదే కంటిన్యూ కావొచ్చు. భారత్‌లో మాత్రం హైరింగ్‌ సెంటిమెంటు పాజిటివ్‌గా ఉండనుంది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు హైరింగ్‌ సెంటిమెంటు పాజిటివ్‌గా ఉందని టీమ్‌లీజ్‌ రిపోర్టు పేర్కొంది. ఈ-కామర్స్‌ (98%), టెలీ కమ్యూనికేషన్స్ (94%), విద్యా రంగం (93%), ఆర్థిక సేవలు (88%), లాజిస్టిక్స్‌ (81%) కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలు లభించనున్నాయి.


ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏబీపీ దేశం' ఫాలో అవ్వండి!