Eetala Rajender: ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో కలిసి పాదయాత్ర చేసి సంఘీభావం తెలిపారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతుల సమస్య పార్టీలకు సంబంధించింది కాదని అన్నారు. అది ధర్మానికి సంబంధించిందని.. ఆకలికి సంబంధించిందని చెప్పారు. అందుకే తాము పాదయాత్రకు సంపూర్ణ మద్దతు అందిస్తున్నామన్నారు. ఫార్మాసిటీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందని కొంతమంది చెబుతున్నారు... కానీ అది పచ్చి అబద్ధం అని వివరించారు. భూసేకరణ అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని అన్నారు. కేంద్రం రైతుల దగ్గర భూములు గుంజుకోమని.. లీగల్ ప్రాసెస్ ఉండవద్దని.. తక్కువ ధరలకు గుంజుకోమని ఏ కేంద్ర ప్రభుత్వము చెప్పదన్నారు. రైతుల పొట్ట కొట్టి పెద్దలకు కట్టబెడతాము అంటే కేంద్రం అనుమతి ఇవ్వదని చెప్పారు. 


ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌కే హెచ్చరిక జారీ చేస్తున్నామమని ఈటల రాజేందర్ తెలిపారు. పేదల కళ్లలో మట్టి కొట్టి పరిపాలన చేస్తామంటే చెల్లదు కాక చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలమంది ప్రజానీకం రైతాంగానికి అండగా నిలబడతారని అన్నారు. బీజేపీ తరపున బాధిత రైతులకు సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇస్తామని ఫార్మా కంపెనీ పెద్దలను హెలికాప్టర్లలో తిప్పి ఏడు సంవత్సరాలు అయిపోయిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతులకు నష్ట పరిహారం అందించలేదని ఫైర్ అయ్యారు. గ్రామసభలు నిర్వహించకుండా వారి అభిప్రాయాన్ని గౌరవించకుండా బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. కాళ్లావేళ్లా పడి మొరపెట్టుకున్నా కేసీఆర్ కనికరించడం లేదన్నారు. 


రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి సంబంధించిన నక్కర్త మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్రి, కురుమిద్ద గ్రామాలకు సంబంధించిన రైతులు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ తరపున పలువురు నేతలు పూర్తి మద్దతు తెలిపారు. అయితే కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలు పలుకుతున్న ఎకరా భూమికి  ఎకరా భూ లక్షల ఇచ్చి తీసుకోవడం దారణం అని అన్నారు. సీఎం కేసీఆర్ కు పిడికెడు మంది ఫార్మా పెద్దల మీద ఉన్న ప్రేమ.. వేలాది మంది పేద రైతుల మీద లేకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పారు. మాట మాట్లాడితే నేను దళితుల కోసం ఉన్నానని చెప్పే ముఖ్యమంత్రికి ఈ దళితుల కన్నీళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 


కోటి నుంచి నాలుగు కోట్ల విలువ చేసే ఎకరూ భూమికి 16 లక్షలు


అసైన్డ్ భూములైన, సొంత భూములైన, లాక్కునేటప్పుడు ఇప్పుడున్న ధర ప్రకారం సేకరణ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మోసం, దగా చేయొద్దని... ఎకరాకు రెండు కోట్ల విలువ ఉంటే పది లక్షల ఇవ్వటం సమంజసం కాదని తెలిపారు. భూమి ఇచ్చిన కుటుంబానికి ఒక ఉద్యోగం కంపెనీలో ఓ ఉద్యోగం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. భూమి నష్టపోయిన రైతులకు ప్రభుత్వ భూములు మరోచోట ఇవ్వాలని అన్నారు. ముచ్చర్ల లోనే కాదు తనకు ఓట్లు వేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కళ్లల్లో కూడా సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని ఆరోపించారు. గౌరారం, వర్గల్, హౌస్లాంపల్లి, నాగిరెడ్డి పల్లెలో వేల ఎకరాల భూములను అతి తక్కువ డబ్బులు ఇచ్చి లాక్కుంటున్నారని అన్నారు.


కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల కన్నీళ్ళకు కారణం అవుతుందే తప్ప పేదలను ఆదుకోవడం లేదని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ చూపు పారిశ్రామిక పెద్దల వైపు ఉందే తప్ప పేదలవైపు లేదు అనడానికి ఈ సంఘటనలే సజీవ సాక్ష్యం అని తెలిపారు. రైతులకు చెప్పకుండానే వారి పాసుబుక్కులు రద్దుచేసి.. టీఎస్ఐఐసీ పేరిట ధరణిలో ఎక్కించే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని.. అప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు.