Wrong UPI Payment - Money Refund: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) మన దేశంలో ఒక చెల్లింపుల విప్లవాన్ని సృష్టించింది. బజ్జీల బండి నుంచి బరిస్టా వరకు.. యూపీఐ ట్రాన్సాక్షన్లు (money transfer through UPI) చాలా సాధారణ వ్యవహారంలా అలవాటయ్యాయి. యూపీఐ మార్గంలో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా ఈజీగా ఉండడంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఈ సాంకేతికత చొచ్చుకు పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన నగదు లావాదేవీల అలవాట్లను UPI పూర్తిగా మార్చేసింది. 


UPI ద్వారా ప్రతి లావాదేవీ చాలా సులభంగా, వేగంగా మారింది. QR కోడ్‌ను స్కాన్ చేయడం లేదా ఫోన్ నంబర్‌ను టైప్‌ చేయడం ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీ పూర్తవుతోంది. అయితే, కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఖాతాకు డబ్బును పంపుతున్నారు. QR కోడ్‌ను స్కాన్ చేసేటప్పుడు ఈ తప్పు జరగడం లేదు గానీ, ఫోన్‌ నంబర్‌ టైప్‌ చేసే సమయంలో మిస్టేక్‌ చేస్తున్నారు. 10 అంకెల ఫోన్ నంబర్‌లో ఒక్క నంబర్‌ను తప్పుగా కొట్టినా, మన డబ్బు రాంగ్‌ పర్సన్‌కు UPI money transfer to the wrong person) వెళ్తుంది. పొరపాటు జరిగిన తర్వాత తల పట్టుకుంటున్నారు. తమ డబ్బులు వెనక్కి వస్తాయో, రావోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పొరపాటు మీరు చేస్తే, ముందు భయపడకండి. కొన్ని స్టెప్స్‌ ఫాలో అయితే మీ డబ్బును సులభంగా తిరిగి పొందొచ్చు. 


నెట్ బ్యాంకింగ్ ద్వారా వేరే అకౌంట్‌కు డబ్బు పంపినా (money transfer through net banking), మీ డబ్బును వెనక్కు తీసుకోవడానికి ఇదే మార్గం అనుసరించండి.


UPI పేమెంట్‌లో పొరపాటు జరిగితే ఏం చేయాలి?


మీరు ఎప్పుడైనా UPI పేమెంట్‌ను తప్పు నంబర్‌/వ్యక్తికి పంపితే.. ముందుగా ఆ నంబర్‌కు కాల్‌ చేయండి. మిస్టేక్‌ జరిగిందని చెప్పి, డబ్బు వెనక్కు ఇవ్వమని అడగండి. మంచి మనస్సున్న వ్యక్తులు మీ బాధను అర్ధం చేసుకుంటారు, డబ్బును వెనక్కు ఇస్తారు.


మీ డబ్బు తిరిగి ఇవ్వడానికి అవతలి వ్యక్తి నిరాకరిస్తే.. మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయండి. UPI సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా మీరు సంప్రదించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెప్పిన ప్రకారం, ముందుగా మీ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సపోర్ట్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయండి. లావాదేవీలో జరిగిన పొరపాటు గురించి వారికి సమాచారం ఇవ్వండి. UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రాంగ్‌ అకౌంట్‌కు డబ్బు బదిలీ అయితే... టోల్ ఫ్రీ నంబర్ 18001201740కి కాల్ చేసి, కంప్లైంట్‌ ఇవ్వవచ్చు. మీ లావాదేవీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌కు అందించాలి.


కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసినా ఉపయోగం లేకపోతే, NPCI (National Payments Corporation of India) పోర్టల్‌లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. NPCI పోర్టల్‌లోకి (NPCI Portal) వెళ్లి, "వాట్‌ వి డు" బటన్‌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటి నుంచి UPIని ఎంచుకోండి. ఆ తర్వాత, "కంప్లెంట్ సెక్షన్"కు వెళ్లి, లావాదేవీ వివరాలను పూరించండి. ఇందులో.. మీ బ్యాంక్ పేరు, ఇ-మెయిల్, ఫోన్ నంబర్, UPI ID వంటి వాటి సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత "ఇన్‌కరెక్ట్‌లీ ట్రాన్సఫర్డ్ టూ ది రాంగా యూపీఐ అడ్రెస్" ఆప్షన్‌ ఎంచుకోండి. దీంతో పాటు, అవసరమైన ప్రూఫ్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.


NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన 30 రోజుల లోపు సమస్య పరిష్కారం కాకపోతే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ‍‌(Banking Ombudsman) కూడా సంప్రదించవచ్చు. అయితే, నిబంధనల ప్రకారం, సంఘటన జరిగిన 3 రోజుల లోపు దాని గురించి మీరు NPCI లేదా సంబంధిత వర్గాలకు రిపోర్ట్‌ చేసి ఉండాలి.


మరో ఆసక్తికర కథనం: