Gold Demand In India: బంగారం ధర ఆల్ టైమ్ హైలో ఉన్న కారణంగా, 2025 సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ పరిమితంగా ఉండే అవకాశం ఉంది. 2024లో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పుత్తడి దిగుమతి సుంకాన్ని తగ్గించడం, వివాహాలు, వివిధ పండుగల సందర్భంగా నగల కొనుగోళ్లు పెరిగాయి. ఈ కారణంగా, గత ఏడాది మన దేశంలో బంగారం డిమాండ్ సంవత్సరానికి 5 శాతం పెరిగి 802.8 టన్నులకు చేరుకుంది. అయితే, 2025లో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉంటుందని అంచనా.
2024లో దేశంలో బంగారం డిమాండ్ 802.8 టన్నులు ఉండగా, 2023లో 761 టన్నులుగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం... 2024లో బంగారం డిమాండ్ మొత్తం విలువ 31 శాతం పెరిగి రూ. 5,15,390 కోట్లకు చేరుకుంది. 2023లో ఇది రూ. 3,92,000 కోట్లుగా ఉంది.
"2025లో పసిడి డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉంటుందని మా అంచనా. ధరలు పెరగకుండా స్థిరంగా ఉంటే, వివాహాల కోసం జరిగే కొనుగోళ్ల కారణంగా బంగారు ఆభరణాలకు డిమాండ్ మెరుగుపడుతుందని భావిస్తున్నాం" - వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇండియా) సచిన్ జైన్
రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం కారణంగా, ప్రస్తుతం, బంగారం ధర రికార్డ్ స్థాయిలో ట్రేడవుతోంది. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా పరిగణించే పసిడి, గ్లోబల్‌గా అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది. మన దేశానికి వస్తే... హైదరాబాద్ మార్కెట్‌లో, బుధవారం, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర రికార్డ్ స్థాయిలో రూ. 87,300 వద్దకు (పన్నులతో కలిపి) చేరింది.
WGC గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్, 2024 నివేదిక ప్రకారం... నాలుగో త్రైమాసికంలో (2024 అక్టోబర్-డిసెంబర్) డిమాండ్ 265.8 టన్నుల వద్ద స్థిరంగా ఉంది. ఇది, 2023లోని ఇదే కాలంలో 266.2 టన్నులుగా, దాదాపు సమానంగా ఉంది. 2023లో 575.8 టన్నులుగా ఉన్న ఆభరణాల డిమాండ్ 2024లో రెండు శాతం తగ్గి 563.4 టన్నులకు చేరింది.
స్వర్ణాభరణాల ధరలు తగ్గే ఛాన్స్!
2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన కొనుగోలుదారుగా ఉందని, ఇది 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని, 2023లోని 16 టన్నుల పర్చేజ్‌తో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ అని సచిన్ జైన్ చెప్పారు. బంగారంలో పెట్టుబడుల ట్రెండ్ బలంగా ఉందని, భవిష్యత్‌లోనూ ఇది కొనసాగుతుందని అంచనా వేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, నాణేలు, బార్‌పై ఆసక్తి చూపుతున్నారు. అంటే, ఆభరణాల రూపంలో ఉన్న పసిడికి డిమాండ్ తగ్గుతోంది, ఫలితంగా నగల రేట్లు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
2024లో ప్రపంచ బంగారం డిమాండ్ దాదాపు స్థిరంగా ఉంది, 2023తో పోలిస్తే కేవలం ఒక శాతం స్వల్పంగా పెరిగింది. WGC నివేదిక ప్రకారం, 2023లో మొత్తం ప్రపంచ గిరాకీ 4,945.9 టన్నులు కాగా, 2024లో ఇది 4,974 టన్నులకు చేరింది. అధిక ధరలు, బలహీనమైన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల కారణంగా ఆభరణాలకు డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణం.
మరో ఆసక్తికర కథనం: పట్ట పగ్గాల్లేకుండా పెరుగుతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ