Wipro Shares Fall: సెప్టెంబర్ త్రైమాసికం లాభంలో (Q2FY23) మార్కెట్ అంచనాలను అందుకోలేపోయిన ఐటీ మేజర్ విప్రో (Wipro Ltd), షేరు ధర పతనం రూపంలో ఆ ఫలితాన్ని రుచి చూసింది. ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడ్‌లో విప్రో షేర్లు BSEలో దాదాపు 7 శాతం పడిపోయాయి.
ఉదయం 11.45 గంటల సమయానికి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 380.50 కి ఈ షేర్లు చేరాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో, ఈ ఐటీ కంపెనీ ఆదాయం 5% QoQ పెరిగి రూ.22,540 కోట్లకు చేరుకుంది. బ్లూంబెర్గ్ ట్రాక్ చేసిన విశ్లేషకుల ఏకాభిప్రాయ అంచనా రూ. 22,615.1 కోట్లతో పోలిస్తే, ట్రాక్‌లోనే ఉంది.
ఆదాయ పరంగా అంచనాలను అందుకున్నా, నికర లాభం మాత్రం 9.3% తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.2,659 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,930.60 కోట్లతో పోలిస్తే లాభం 9.3 శాతం తగ్గింది. సిబ్బంది వ్యయాలు పెరగడం, అమెరికాయేతర మార్కెట్లలలో ఆదాయాలు తగ్గడం ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది. అయితే ఏప్రిల్-జూన్‌లోని (QoQ) రూ.2,563.60 కోట్లతో పోలిస్తే లాభం 3.72 శాతం పెరిగింది.
దెబ్బకొట్టిన ఫ్యూచర్ గైడెన్స్
మూడో త్రైమాసికం (Q3FY23) కోసం ఇచ్చిన రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ చాలా నాసిరకంగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు - భౌగోళిక రాజకీయ సమస్యల నేపథ్యంలో, Q3లో, 0.5-2 శాతం ఆదాయ వృద్ధిని ఈ కంపెనీ అంచనా వేసింది. ఇది కూడా స్ట్రీట్ అంచనాల కంటే చాలా తక్కువ. Q1 గైడెన్స్ 3-5 శాతం కంటే కూడా తక్కువ. షేరు ధర మీద ఈ గెడెన్స్ ప్రభావం ఎక్కువగా పడింది.
IT సేవల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం 2,811 - 2,853 మిలియన్ డాలర్ల మధ్యలో ఉంటుందని తాము భావిస్తున్నామని; ఇది, QoQ ప్రాతిపదికన 0.5 - 2.0 శాతం వృద్ధికి సమానమని Q3 ఔట్‌లుక్‌లో విప్రో పేర్కొంది. సర్వీస్‌లలో, క్రాస్ సెల్లింగ్ ద్వారా నష్టాలను పూడ్చుకున్నా, కన్సల్టింగ్ వ్యాపారంలో మందగమనం ప్రారంభమైందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
కళ్లు బైర్లు కమ్మే పతనం
గత ఆరు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లోని 1.9 శాతం క్షీణతతో పోలిస్తే, ఈ స్క్రిప్ 32 శాతం నష్టపోయింది. గత నెల రోజుల కాలంలో దాదాపు 10 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే, కళ్లు బైర్లు కమ్మే నష్టాన్ని ఇన్వెస్టర్ల నెత్తిన రుద్దిందీ కౌంటర్. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 47 శాతం దిగి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న రూ. 718.60 నుంచి ఇవాళ ఉదయం 11.45 గంటల సమయానికి రూ. 380.50 దగ్గరకు చేరింది. ఈ కాలంలో . 338.10 రూపాయలు నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.