Wipro CEO Annual Pay: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో సీఈవో థిరీ డెలాపోర్ట్‌ (Thierry Delaporte) అరుదైన రికార్డు సృష్టించారు. భారత ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోగా నిలిచారు. 2022, మార్చి 31తో ముగిసిన ఏడాదిలో ఆయన ఏకంగా రూ.79.66 కోట్లు సాలరీగా తీసుకున్నారు. యూఎస్‌ సెక్యూరిటీస్‌, ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ వద్ద విప్రో దాఖలు చేసిన వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం తెలిసింది. దీంతో ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవో సలిల్‌ ఫారేఖ్‌ను డెలాపోర్ట్‌ అధిగమించారు.


వేతనం రూపంలో 1.7 మిలియన్‌ డాలర్లు, కమిషన్‌గా 2.5 మిలియన్‌ డాలర్లు, ప్రయోజనాల కింద 2 మిలియన్‌ డాలర్లు, ఇతర విభాగాల ద్వారా 4 మిలియన్‌ డాలర్లను డెలాపోర్ట్‌  ఆర్జిస్తున్నారని జూన్‌ 9న యూఎస్‌ సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ వద్ద విప్రో నివేదిక దాఖలు చేసింది. ఇందులో ఒకసారి ఇచ్చే నగదు రివార్డూ ఉందని వెల్లడించింది. 2020, జులైలో ఆయన విప్రో సీఈవోగా చేరారు. అదే ఏడాది భారత్‌లోని అన్ని ఐటీ కంపెనీల సీఈవోల కన్నా అధిక వేతనం అందుకున్నారు. సాలరీ ద్వారా రూ.9.6 కోట్లు, కమిషన్‌ రూపంలో రూ.11.2 కోట్లు, సుదీర్ఘ కాల పరిహారం కింద రూ.5.5 కోట్లు, ఇతర విభాగాల కింద రూ.37.81 కోట్లు వేతనంగా పొందారు.


ఏ సీఈవోకు ఎంత వేతనం



  • ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పారేక్‌ వేతనం 2021-22లో 43 శాతం పెరిగింది. దాంతో ఆయన రూ.71.02 కోట్లు వేతనంగా పొందారు.

  • అసెంచర్‌ సీఈవో జూలీ స్వీట్‌  2022 ఆర్థిక సంవత్సరంలో 23 మిలియన్‌ డాలర్లు వేతనంగా ఆర్జించారు. ఇందులో కంపెనీ షేర్లూ ఉన్నాయి.

  • కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియన్‌ హంఫైర్స్‌ 2022 ఆర్థిక సంవత్సరంలో 19.6 మిలియన్‌ డాలర్లు పొందారు.

  • ఐబీఎం సీఈవో, ఛైర్‌ పర్సన్‌ అరవింద్‌ కృష్ణ 17.56 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.

  • టీసీఎస్‌ సీఈవో రాజేశ్‌ గోపీనాథన్‌ రూ.34 కోట్లు అంటే 4.48 మిలియన్‌ డాలర్లు తీసుకున్నారు.