Rewards to budget making team: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 01 ఫిబ్రవరి 2025న, 2025-26 ఆర్ఖిక సంవత్సరం (Financial Year 2025-26) కోసం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ మోదీ ప్రభుత్వానికి 14వ బడ్జెట్.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతి పరిస్థితుల గురించి చాలా మంది ప్రజలకు తెలుసుగానీ, బడ్జెట్ సమర్పించే ముందు ఏం జరుగుతుందో ఎక్కువ మందికి తెలీదు. బడ్జెట్ సిద్ధం చేసేందుకు ఒక ప్రత్యేక బృందం ఉంటుంది, వాళ్ల పని ఎంత సవాళ్లతో కూడుకున్నదో ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవానికి, బడ్జెట్ తయారీ అనేది కేవలం ఒక రోజు పని కాదు, రోజుల తరబడి సాగే సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. దీనిలో అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం ఏర్పడాలి.
బడ్జెట్ తతంగం మొత్తం పూర్తి గోప్యం
బడ్జెట్‌ను సిద్ధం చేసే బృందానికి ఉన్న బాధ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, బడ్జెట్ అనేది దేశ ఆర్థిక దిశను & ప్రజల కోసం ప్రభుత్వ పథకాల రూపురేఖలను నిర్ణయిస్తుంది. బడ్జెట్ తయారీ పని అత్యంత గోప్యంగా సాగుతుంది. ప్రభుత్వ అధికారులు, బడ్జెట్ బృందం సభ్యులు అన్ని ముఖ్యమైన గణాంకాలు, అంచనాలు, ప్రణాళికల గురించి పూర్తి మౌనంగా ఉంటారు. ఈ సమయంలో, మీడియాతో మాట్లాడటానికి లేదా బయటి వ్యక్తులతో చర్చించడానికి వాళ్లకు అనుమతి ఉండదు.
నార్త్ బ్లాక్‌లో లాక్‌డౌన్
కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు బడ్జెట్‌లోని ప్రతి అక్షరం, ప్రతి అంశం రహస్యంగా ఉండాలి. ఈ కారణంగా, బడ్జెట్ టీమ్‌ను బాహ్య ప్రపంచం నుంచి విడదీసి 'నార్త్ బ్లాక్' (North Block)లో లాక్‌డౌన్ చేస్తారు. ఒక విధంగా, వాళ్లను 'జైలు తరహా వాతావరణం'లో ఉంచుతారు. నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ జరుగుతుంది. బడ్జెట్ ప్రింటింగ్ కాలంలో, బడ్జెట్‌తో సంబంధం ఉన్న అందరు అధికారులు & సిబ్బంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. పార్లమెంటులో బడ్జెట్ పేపర్లను సమర్పించే వరకు వాళ్లు అక్కడే ఉండాలి. వాళ్లకు - బాహ్య ప్రపంచానికి సంబంధాలు కట్ అవుతాయి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీలుండదు. వాళ్ల నుంచి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటివి కూడా మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ప్రింటింగ్ పూర్తయ్యే వరకు వాళ్లందరిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కన్నేసి ఉంచుతుంది. సమర్పణకు ముందే బడ్జెట్ లీక్ కాకుండా చూసేందుకే ఈ కట్టడి చర్యలు.
బడ్జెట్ తయారీ బృందానికి ఎక్కువ జీతం లభిస్తుందా?
బడ్జెట్ సమయం ఆసన్నమైనప్పుడల్లా, బడ్జెట్ తయారీ బృందంలోని ఉద్యోగులు ఎక్కువ జీతం పొందుతారా అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ బృందానికి ఎక్కువ జీతం లభించదు, సాటి ఉద్యోగులు పొందే జీతమే వాళ్లూ తీసుకుంటారు. అయితే, బడ్జెట్ తయారీలో పాలు పంచుకున్నందుకు ప్రత్యేక రివార్డులు & ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, బడ్జెట్ తయారీ పని అనేది విధుల్లో ఒక భాగంగా & దేశ సేవగా పరిగణిస్తారు.
మరో ఆసక్తికర కథనం: ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు స్పెషల్‌గా నిలుస్తుంది, కొత్త స్కీమ్‌లతో మీ మతిపోతుంది!