Why is RBI reducing the circulation of 500 notes: ఐదు వందల నోట్లను క్రమంగా ఆర్బీఐ మార్కెట్ నుంచి తగ్గిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. RBI ఏప్రిల్ 28, 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది, దీని ప్రకారం బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOs) తమ ATMలలో 100 , 200 రూపాయల నోట్లను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది.  సెప్టెంబర్ 30, 2025 నాటికి అన్ని ATMలలో 75 శాతం కనీసం ఒక క్యాసెట్‌లో  100 లేదా 200 నోట్లను ఉంచాలి.. మార్చి 31, 2026 నాటికి అన్ని ATMలలో 90 శాతం కనీసం ఒక క్యాసెట్‌లో  100 లేదా  200 నోట్లను అందించాలని ఆర్బీఐ సర్క్యులర్ స్పష్టం చేసింది. 

 ఈ విధానం ATMలలో ₹100 మరియు ₹200 నోట్ల అందుబాటును పెంచడానికి ఉద్దేశించినదని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం   ATMల నుండి ₹500 నోట్లు మాత్రమే వస్తున్నాయని, ఇది చిన్న లావాదేవీలకు అసౌకర్యంగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకునన్నట్లుగా చెబుతున్నారు. అయితే  RBI సర్క్యులర్‌లో 500 నోట్లను ATMల నుండి పూర్తిగా ఆపివేయాలని లేదా వాటిని నిషేధించాలని ఎటువంటి సూచన లేదు. బదులుగా, 100, 200 నోట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచేలా చేయడంపై దృష్టి సారించింది. కానీ ఐదు వందల నోట్ల చెలామణిని తగ్గిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. 

సోషల్ మీడియాలో  RBI ATMల నుండి 500 నోట్లను పూర్తిగా ఆపివేస్తోందన్న ప్రచారం ప్రారంభమయింది.  

ఈ వాదనలు RBI  అసలు సర్క్యులర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నవని  500 నోట్లను నిషేధించడం గురించి ఎటువంటి ప్రస్తావన  ఆర్బీఐ సర్క్యులర్ లో లేదని నిపుణులు చెబుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు మే 30, 2025న 500  నోట్లను చలామణి నుండి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సూచన RBI   ATM విధానంతో సంబంధం లేనిది. ఐదు వందల నోట్ల చెల్లుబాటుపై ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో చెలామణిని కూడా నియంత్రించడం లేదని చెబుతున్నారు.